28, డిసెంబర్ 2020, సోమవారం

లంబసింగి అందాలు

లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు

లంబసింగి

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి.

మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు.

సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే... ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు.

శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసిపోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో డిసెంబరు నుంచి జనవరి చివరి వరకూ అతి చల్లటి వాతావరణం కనిపిస్తుంది.

ఈ కాలంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం పదిగంటలైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం

లంబసింగి

'ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు'

ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్రబయలు అని పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.

ఈ చలి తీవ్రతకి ఓసారి ఓ దొంగ ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

"ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నా చిన్నతనంలో జరిగిన సంఘటన చెబుతాను. ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థులు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒక పెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆ కొయ్యకి కట్టి... రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసానులు వైద్యం చేసి కాపాడారు. అతడు కోలుకోడానికి మూడు రోజులు పట్టింది. ఇక్కడ ఆ స్థాయిలో చలి ఉంటుంది. ఒకప్పుడు మా గ్రామంలో పది మంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మా గ్రామానికి వస్తున్నారు. అసలు ఇది మా ఊరేనా అనిపిస్తుంటుంది" అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

లంబసింగి

నిత్యం భోగి పండగే

కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది లంబసింగి. అందరికి భోగి పండగ ఏడాదికి ఒకసారి వస్తే... ఇక్కడి వారికి మాత్రం నిత్యం భోగి పండగే. నిత్యం చలి మంటలు కనిపిస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ... అలాగే సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.

"ఇప్పుడు చలీ, మంచూ... అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ మేం పుట్టి పెరిగింది ఈ చలిలోనే, మా జీవితం గడిచేది ఈ మంచులోనే. అయితే ఏడాదిలో మూడు నెలల పాటు పర్యాటకులు రావడంతో మాకు పండగలా ఉంటుంది. టీవీ, పేపర్లలో మా గ్రామాన్ని చూపించడం మాకు భలే సరదాగా ఉంటుంది. మాకు టీ, టిఫిన్ వ్యాపారం బాగా జరుగుతుంది. కాకపోతే సీజన్ అయిపోగానే మళ్లీ మా గ్రామాలు బోసిపోతాయి. అప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది" అని స్థానిక టీ దుకాణం యాజమని సోమశేఖర్ చెప్పారు

లంబసింగి

'ఉండేది 250 మంది... వచ్చేది లక్షల మంది'

దట్టంగా కమ్ముకున్న పొగమంచు ఓవైపు... మంచు తుంపరుల పలకరింపు మరోవైపు... గాలిని సైతం గడ్డకట్టించే చల్లగాలి ఇంకోవైపు... ఇవి లంబసింగిలో నిత్యం కనిపించే దృశ్యాలు.

మైదాన ప్రాంతాలకు సుదూరంగా ఉండే లంబసింగి లాంటి గిరిజన గ్రామాలకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషులు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

లంబసింగిలో ఉన్నవి కేవలం 60 కుటుంబాలు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకులతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది.

"లంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ 10 నుంచి 12 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. నాలుగు నెలల పాటు సీజన్ కొనసాగుతుంది. లంబసింగి ఏజెన్సీ టూరిజానికి హాట్ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే లంబసింగికి ఆంధ్రా కశ్మీర్, ఆంధ్రా ఊటీ, దక్షిణాది కశ్మీర్ అనే పేర్లొచ్చాయి. టూరిజం శాఖ కూడా ఈ ప్రాంతాన్ని ప్రొమోట్ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయడంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది" అని లంబసింగి టూరిజం యూనిట్ మేనేజర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

లంబసింగి

కొండగ్రామంలో హనీమూన్

విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం. అందులో 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణమే. వంపులు తిరిగిన కొండల్లో సాగే ఈ ప్రయాణం నిజంగా ఒక మధురానుభూతే.

లంబసింగి వరకు మాములుగా ఉండే చలి... చెక్ పోస్ట్ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఛాయ్ మీద ఛాయ్ కొట్టాల్సిందే. లేదా చలిమంటల వద్దకు పరుగులు పెట్టాల్సిందే.

"మాది విజయవాడ. లంబసింగి గురించి 5 ఏళ్ల క్రితం తెలిసింది. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు నాకు పెళ్లైంది. హానీమూన్‌కి ఎక్కడికో వెళ్లడం ఎందుకు లంబసింగైతే బాగుంటుందని ఇక్కడికే వచ్చాం. లంబసింగి వాతావరణం అద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రకృతి అందాల్నీ... పై నుంచి పడుతున్న మంచు కిరణాల్నీ... ఎప్పటీకి మరచిపోలేను" అని నిఖిత బీబీసీతో చెప్పారు.

లంబసింగి

3 గంటల కోసం... 2 రోజుల పర్యటన

ఇక్కడి మంచు అందాలనూ... ఎప్పుడూ అనుభవించనంత చలినీ... ఎంజాయ్ చేయాలంటే రెండు రోజుల లంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసుకోవాలి. ముందురోజు రాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్న టూరిస్టులు... లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోదయాన్ని చూడటం కోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు...చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.

లంబసింగిలో తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన చలి ఉదయం ఏడు గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.

కుటుంబాలు, కొత్త జంటలు, ప్రేమికులు ఇలా ఎక్కడెక్కడి నుంచో 'ఛలో లంబసింగి' అంటూ వస్తుంటారు. శీతకాలం వారాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు, భువనేశ్వర్ నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

దీంతో ఈ గిరిజన గ్రామంలో గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయి...నగర వాతావరణాన్ని తలపిస్తుంది. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ కెమెరాలకు పనిచెబుతారు. ప్రకృతి అందాల నేపథ్యంతో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకులు చలిమంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు.

లంబసింగి

మంచు 'పాలసముద్రం'

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో 'చెరువులవేనం' అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో, ఫోటోల్లోనో గ్రాఫిక్ మాయజాలంలో చూసే పాలసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్షమతుంది.

మంచు మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే 'చెరువులవేనం' పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. ఉదయం నాలుగైదు గంటలకే లంబసింగి చేరుకున్న పర్యాటకులు 'చెరువులవేనం' వెళ్లేందుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాలను ఆస్వాదిస్తారు.

ఇక లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వాయర్ ఉంది. ఇది కూడా పర్యాటక కేంద్రమే. ఈ రిజర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.

ఈ రిజర్వాయర్‌పై 'జిప్ వే' ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్ ఒక చివర నుంచి మరో చివరకు గాల్లో తేలుతూ...సెల్ఫీలు తీసుకుంటూ 'జిప్ రోప్' ద్వారా చేరుకుంటారు పర్యాటకులు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులను అలరించేందుకు థింసా నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.

లంబసింగి

పెరిగిన పర్యాటకం... తగ్గిన వలసలు

లంబసింగితో పాటు చుట్టు పక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతుండేవారు. అయితే గత కొంతకాలంగా లంబసింగి విపరీతంగా ఫేమస్ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య అనుహ్యాంగా పెరిగింది.

పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాలు విస్తరించాయి. టూరిస్టులు పెరగడంతో స్థానిక యువకులు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు.

ఇక్కడ 'నైట్ స్టే' చేసేందుకు రిసార్ట్స్, హోటల్స్, గుడారాలను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికులు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది.

"టిఫిన్, టీ దుకాణాలతో పాటు రాత్రి స్టే చేసేందుకు టూరిస్టులకు గుడారాలు అద్దెకివ్వడం, టూరిస్టుల కోరిక మేరకు వారు భోజన సౌకర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధి పొందేకంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని...అన్ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు రిసార్ట్స్ కూడా రావడంతో... వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది" అని గుడారాలను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్ చెప్పారు

లంబసింగి

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే...

లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమతుల్యతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటరాలజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ.

"రెండు చిన్న కొండల మధ్యలో ఉండే గ్రామం లంబసింగి. రెండు కొండల మధ్య నుంచి వచ్చే శీతల గాలులు అక్కడ మేఘాలను నిలవనివ్వవు. దాంతో అక్కడ చల్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరో కారణం. ముఖ్యంగా గుంపులుగా ఉండే చెట్ల వల్ల ఇక్కడి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ప్రకృతి సమతుల్యత ఉన్న ప్రదేశాల్లో చల్లని, అతి చల్లని వాతావరణం ఉంటుంది. అలాగే సైబీరియన్ వేవ్స్ ప్రభావం కూడా అధికంగా ఉండటంతో అక్కడి నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుంది"అని ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు


బిబిసి నుండి సేకరణ...



30, నవంబర్ 2020, సోమవారం

వాణీ జయరాం

ఆమె గానం... సుమధురం

70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్‌ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో ‘బోల్‌ రే పపీ హరా.. పపి హరా’ అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అది ‘గుడ్డి’ సినిమాలో ఆమె పాడిన మొదటిపాట. అలా మొదటి పాటతోనే హిందీ చిత్రసీమలో వాణిజయరాం పేరు మారుమోగి పోయింది. సంప్రదాయ కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతురాలైన వాణిజయరాం పాటలు విలక్షణంగా ఉండేవి. క్రమంగా నౌషాద్, మదన్‌ మోహన్, జయదేవ్, చిత్రగుప్త, ఓ.పి. నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కల్యాణ్‌ జీ ఆనంద్‌ జీ, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి సంగీత దర్శకులు వాణిజయరాంకి మంచి అవకాశాలు ఇవ్వటం మొదలైంది. చలనచిత్రరంగం ఆమెను ‘భారతీయ నైటింగేల్‌’ అని పిలవసాగింది. అప్పటికే వేళ్లూనుకొని వున్న కొందరికి ఆమె ఎదుగుదల రుచించలేదు. సహజంగానే రాజకీయం నడిపారు. సున్నిత మనస్కురాలైన వాణిజయరాంకి మనస్తాపం కలిగింది. వెంటనే మద్రాసుకి మకాం మార్చింది. అలా తెలుగు సినిమాల్లో ఆమె పాడిన పాటలు వినే భాగ్యానికి శ్రోతలు నోచుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమాలే ఆమెకు రెండు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు తెచ్చిపెట్టాయి. నవంబరు 30న వాణి జయరాం  పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు....

సంగీత నేపథ్యం...

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణిజయరాం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కచెల్లెళ్ల సంతతిలో వాణిజయరాం ఐదవ సంతానం. తల్లి పద్మావతి ప్రముఖ వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగార్‌ శిష్యురాలు. కుటుంబ సభ్యులందరికీ సంగీతమంటే ప్రాణం. తన అక్క కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్‌ వద్ద సంగీత శిక్షణ పొందుతూ వుంటే వాణి కూడా ఆమెతోబాటు కీర్తనలు పాడుతుండేది. కుటుంబం మద్రాసుకు మకాం మార్చిన తరువాత కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్‌.బాలసుబ్రమణియన్, ఆర్‌.ఎస్‌.మణిల శిష్యరికంలో కఠినమైన కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టింది. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు వాణి బాగా పాడేది. తన ఎనిమిదవ ఏటనే వాణిజయరాం సంగీత కచేరి నిర్వహించింది. చిన్నతనం నుంచీ హిందీ పాటలు రేడియో సిలోన్‌లో వినటం వాణికి అలవాటు. నేపధ్యగాయనిగా ప్రయత్నం చేస్తానంటే తల్లి ఒప్పుకోలేదు. పెళ్లయ్యేదాకా ఆ ప్రయత్నం మానుకోమంది. మద్రాస్‌ క్వీన్స్‌ మేరీ కాలేజిలో పట్టా పుచ్చుకున్న తరువాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తొలుత మద్రాసు, తరువాత హైదరాబాదులో ఉద్యోగం చేసింది. 1960లో జయరాంతో వివాహానంతరం వాణి మకాం బొంబాయికి మారింది. వ్యాపార ప్రకటనలకు ‘జింగిల్స్‌’ పాడుతూ వాణిజయరాం బిజీగా ఉంటూనే ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ వద్ద హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో శిక్షణ పొందింది. ఈ శిక్షణ ఎంత కఠినమైందంటే రోజుకి 18 గంటలు ‘తుమ్రి భజన్‌’లో మెళకువలు ‘గజల్‌’ ప్రక్రియలో సాంకేతికత నేర్చుకొవటానికే సరిపోయేది. ఈ శిక్షణా కాలంలోనే వాణిజయరాం తన మొట్టమొదటి హిందుస్తానీ క్లాసికల్‌ కచేరిని మార్చి 1, 1969న బొంబాయిలో ఏర్పాటుచేసి సభికుల్ని అలరించి విద్వాంసుల్ని ఆకట్టుకుంది. అప్పుడే ప్రముఖ సంగీత దర్శకుడు వసంత దేశాయిని కలవటం తటస్థించింది. వినూత్నమైన ఆమె కంఠస్వరానికి ముగ్దుడైన వసంత దేశాయి వాణిజయరాంతో తొలుత కుమారగంధర్వతో ఒక మరాఠీ యుగళగీతాన్ని పాడించారు. ఆ వెంటనే హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘గుడ్డి’ (1971) సినిమాలో మూడు పాటలు పాడించారు. వసంతదేశాయ్‌ మేఘమల్హర్‌ రాగంలో స్వరపరచిన ‘బోల్‌ రే పపీ హరా, పపి హరా’ను తన తొలి హిందీ పాటగా వాణిజయరాం 22 డిసెంబరు 1970న పాడింది. ఆ పాటకు ఐదు అవార్డులే కాక, ప్రతిష్టాత్మక ‘తాన్సేన్‌ సమ్మాన్‌’ అవార్డు కూడా వచ్చింది. తరువాత వాణి ఎన్నో మరాఠీ పాటలు పాడింది. పండిట్‌ కుమార గంధర్వతో కలిసి యుగళగీతాలు పాడింది. వసంత దేశాయితో మహారాష్ట్ర మొత్తం పర్యటించి గొప్ప మరాఠీ పాటల రుచులను ప్రజలకు చేరువ చేసింది. పాఠశాల విద్యార్ధులకు మరాఠీ సంగీతంలో శిక్షణ ఇచ్చింది. నిద్రలేవగానే ఆమె నమస్కరించేది దేవుడి పటంతోబాటు మొదటి గురువు వసంత దేశాయి ఫోటోకే. అంతేకాదు అతని ఫోటోకి నిత్యం పూజ కూడా చేస్తుంది. ‘గుడ్డి’ విజయంతో వాణిజయరాం ముఖ్య సంగీత దర్శకులకే కాకుండా మరాఠీ, గుజరాతి, మార్వాడి, భోజపురి భాషా చిత్రాలకూ పాటలు పాడింది. రఫీ, మన్నాడే, మహేంద్ర కపూర్, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ల సరసన ఎన్నో యుగళ గీతాలకు ప్రాణం పోసింది. నౌషాద్, చిత్రగుప్త, మదన్‌ మోహన్, ఓ.పి.నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కళ్యాన్‌ జి ఆనంద్‌ జి, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి హేమాహేమీలైన సంగీత దర్శకుల చిత్రాలకు అనేక హిందీ పాటలు ఆలపించింది. తరువాత ఆమె మకాం మద్రాసుకు మార్చింది.

దక్షిణ భారత గాన సరస్వతిగా..

వాణిజయరాం మద్రాసుకు తరలి రావటం దక్షిణ భారత చిత్రసీమకు మేలే జరిగింది. మాతృభాష కాకపోయినా పాడిన అన్ని భాషల్లో మాటల స్వచ్చతతోబాటు నేటివిటీని జోడించి పాడటంచేత ఆమె కంఠాన్ని తమ స్వంత ఆడపడుచు స్వరంగానే అందరూ భావించి ఆదరించారు. మద్రాసు వచ్చిన కొత్తలో వాణిజయరాం చేత ఎస్‌.ఎం.సుబ్బయ్య నాయుడు ‘తాయ్యుం సెయ్యుం’ అనే చిత్రానికి పాడించారు. అనివార్యకారణాల వలన ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తరువాత శంకర్‌-గణేష్‌ ‘వీట్టుక్కు వందా మరుమగü్’ (1973) చిత్రంలో సౌందర్‌ రాజన్‌తో కలిసి ‘ఓరిడం వున్నిడం’ అనే యుగళ గీతాన్ని పాడించటంతో తమిళంలో వాణిజయరాం బిజీ అయ్యారు. తరువాత శంకర్‌-గణేష్‌ సంగీత దర్శకత్వంలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎం.ఎస్‌.విశ్వనాథన్‌-బాలచందర్‌ జంట కలిసి పనిచేసిన అనేక తమిళ సినిమాలకు వాణిజయరాం అద్భుతమైన పాటలు పాడారు. వారి సంగీతసాంగత్యం చాలాకాలం కొనసాగింది. ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమాతో వాణిజయరాం చాలా బిజీ అయ్యారు. కున్నక్కుడి వైద్యనాదన్, వి.కుమార్, జి.కె. వెంకటేష్, విజ్కాయ భాస్కర్, కె.వి.మహదేవన్‌ సంగీత సారధ్యంలో వాణిజయరాం ఎన్నో తమిళ, కన్నడ పాటలు పాడారు. 1973లో ‘స్వప్నం’ అనే మళయాళ చిత్రానికి సలీల్‌ చౌదరి సంగీత దర్శకత్వంలో ‘సౌరయుద్ధత్తిల్‌ విదర్నూరు’ అనే పాట పాడారు. ఆ పాట మలయాళంలో మంచి హిట్టయింది. మళయాళ సంగీతదర్శకులు ఎం.కె. అర్జునన్, దేవరాజన్, ఆర్‌.కె. శేఖర్, దక్షిణామూర్తి, బాబురాజ్, శ్యామ్, రవీంద్రన్, కన్నూర్‌ రాజన్, జెర్రీ అమలదేవ్‌ పనిచేసిన సినిమాలకు వాణిజయరాం కొన్ని వేలపాటలు పాడారు. అలాగే కన్నడ చిత్రసీమలో ఎల్‌.వైద్యనాదన్, టి.జి.లింగప్ప, ఉపేంద్ర కుమార్, హంసలేఖ సంగీత దర్శకత్వం నెరపిన వందలాది సినిమాలలో తన గళం వినిపించారు. తెలుగులో కోదండపాణి వాణిజయరాంతో ‘అభిమానవంతులు’ (1974) సినిమాకి ‘ఎప్పటివలె కాదురా నా స్వామీ’ అనే ఒక జావళి పాడించారు. ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు తొలిసారి సినిమాలో ఈ పాటకు నర్తించటం విశేషం. ఇక్కడో విషయం గుర్తు చెయ్యాలి. ప్రముఖ దర్శక నిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే’(1955)లో హీరోయిన్‌ సంధ్యకి ‘జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే’ అనే మీరా భజన్‌ని సంగీత దర్శకుడు వసంత దేశాయి లతా మంగేష్కర్‌ చేత పాడించారు. ఈ పాటకి పద్మవిభూషణ్‌ శివకుమార్‌ శర్మ సంతూర్‌ వాద్యం వినిపించారు. హిందీ పాటల్లో సంతూర్‌ పరికరాన్ని వాడటం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ పాట బహుజనాదరణ పొందింది. 1979లో గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ సినిమాలో పాటలన్నీ సంగీత దర్శకుడు పండిట్‌ రవిశంకర్‌ వాణిజయరాంతో పాడించారు. ముఖ్యంగా ‘జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే’ భజన్‌ ఆమె గళంలో అద్భుతంగా అమరింది. పైగా సంతూర్‌ వాయిద్యానికి బదులు రవిశంకర్‌ సితార్‌ వాయిద్యాన్ని స్వయంగా వాయించటంతో పూవుకు తావి అబ్బినట్లయింది. ఈ పాటకు వాణిజయరాం ‘ఫిలిం వరల్డ్‌ సినీ హెరాల్డ్‌’ బహుమతి అందుకుంది. అందరూ లతా పాటని, వాణిజయరాం పాటని పోల్చి చూసి, వాణి పాడిన పాటే బాగుందని తేల్చారు. ఇదే పాటని యష్‌ చోప్రా నిర్మించిన ‘సిల్‌ సిలా’(1981) చిత్రంలో సంగీత దర్శకులు శివ్‌-హరి మళ్లీ లతా చేత పాడించారు. అక్కడ కూడా లతా పాటకన్నా వాణిజయరాం ఆలపించిన భజనే గొప్పగా వుందని తేలింది.
                                   
‘మీరా’ చిత్రం విడుదలైన తరువాత నుంచి వాణిజయరాంను ‘మీరా ఆఫ్‌ మోడరన్‌ ఇండియా’గా అభివర్ణించడం మొదలైంది. ఈ పాటకు వాణిజయరాం ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్‌ బహుమతి కూడా అందుకుంది. లతాజీకి వాణిజయరాం మీద అసూయ పెరిగేందుకు ఇవన్నీ కారణాలయ్యాయి. ఈ రాజకీయాన్ని భరించలేని వాణిజయరాం హిందీ చిత్రసీమకు దూరంగా జరిగింది. అయితే, ఎం.ఎస్‌. విశ్వనాథన్, మహదేవన్, రాజన్‌-నాగేంద్ర, విజయ భాస్కర్, చక్రవర్తి, సత్యం, శంకర్‌-గణేష్, చంద్రబోస్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణిజయరాం ప్రతిభను చక్కగా వినియోగించుకొని, ఆమె గళం ద్వారా తమ పాటలకి వన్నె తెచ్చారు. తమిళంలో ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ స్వరం కూర్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ (తెలుగులో తూర్పు-పడమర) చిత్రంలో ‘ఏళు స్వరంగళుక్కుళ్‌’ పాటకు 1976లో జాతీయ స్థాయిలో ఆమె ఉత్తమ గాయని ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తరువాత ఆ అదృష్టం తెలుగు చిత్రాలకే దక్కింది. ‘శంకరాభరణం’ (1980)లో ఆలపించిన ‘బ్రోచేవారెవరురా’, ‘మానస సంచరరే’, ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే మూడు పాటలకు సంయుక్తంగా; ‘స్వాతికిరణం’(1991) చిత్రంలో ‘ఆనతినీయరా హరా’ అనే పాటకు వాణిజయరాంకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డులు దక్కాయి. ఇవి కాక గుజరాత్‌ (ఘూంఘట్‌), తమిళనాడు (అళఘే ఉన్నై ఆరాధిక్కిరేన్‌), ఆంధ్రప్రదేశ్‌ (శంకరాభరణం), ఒడిషా (దేబ్జని) రాష్ట్రాల పురస్కారాలు కోకొల్లలుగా అందాయి. ‘2015లో ఆమె ఫిలింఫేర్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని, పి.బి. శ్రీనివాస్‌ అవార్డుని అందుకున్నారు. 1992లో ‘సంగీతపీఠ’ సన్మానాన్ని అందుకున్న అతి పిన్నవయస్కురాలు వాణిజయరాం కావడం విశేషం. తమిళనాడు ప్రభుత్వం వాణిజయరాంకు ‘కలైమామణి’ పురస్కారాన్ని, త్యాగరాజర్‌ భాగవతార్‌ పేరిట ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని, సుబ్రమణ్య భారతి అవార్డును, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అవార్డులను ప్రదానం చేసింది. చెన్నైలోని ముద్ర అకాడమీ వారు దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ సంగీతాన్ని అందించినందుకు వాణిజయరాంకు ‘ముద్ర అవార్డు’ బహూకరించారు. ఇంకా ఎన్నెన్నో బహుమతులు వాణిజయరాంకు దక్కాయి. ఘంటసాల జాతీయ బహుమతి, దక్షిణ భారత మీరా బహుమతి వాణిజయరాం అందుకున్నారు.

భక్తి పాటల జగధాత్రి...

భక్తి పాటలు పాడటంలో పదిహేనేళ్లుగా వాణిజయరాం మహారాజ్ఞిగా వెలుగొందుతున్నారు. రఘునాథ పాణిగ్రాహి తరువాత జయదేవుని అష్టపదులకు వూపిరినిచ్చిన గాయని వాణిజయరాం. ఆమె దాదాపు 18 భాషల్లో భక్తి గీతాలు ఆలపించారు. సంగీతోత్సవాల్లో వాణిజయరాం పాల్గొని ప్రదర్శనలిచ్చేది. ‘బద్రి కేదార్‌ ఫెస్టివల్‌’, ‘గంగా మహోత్సవ్‌’, ‘వారణాసి ఉత్సవ్‌’, ‘స్వామి హరిదాస్‌ ఫెస్టివల్‌’ వంటి భక్తి ప్రధాన ఉత్సవాల్లో వాణిజయరాంకి ప్రధమ తాంబూలం దక్కేది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాణిజయరాం పాల్గొనని కచేరీలే లేవు. తులసీదాసు, భక్త కబీర్, మీరా, పురందరదాసు, అన్నమయ్య, త్యాగరాజు సంకీర్తనలను సంగీతరూపంలో ముద్రించి భద్రపరిచారు. బ్రిజు మహారాజ్‌తో కలిసి ‘టుమ్రి’ భజనగీతాలు ఆలపించారు. ప్రఫుల్లకర్‌ సంగీత సారధ్యంలో ఒడిస్సీ గురుకులచరణ్‌ మహాపాత్రతో కలిసి ‘గీతగోవిందం’ ఆల్బం కోసం వాణిజయరాం పాడారు. కుమార గంధర్వతో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రుణానుబంధచ్య’ అనే మరాఠీ శాస్త్రీయ యుగళాన్ని ఆలపించారు. ఈ పాటకు వాణిజయరాం గురువు వసంతదేశాయ్‌ సంగీతం సమకూర్చారు. ఆమె సొంతంగా స్వరపరచిన ‘మురుగన్‌’ భక్తి గీతాలను ఆల్బంగా విడుదలచేశారు. ‘సినిమా పాటలకి, భక్తి పాటలకి చాలా వ్యత్యాసం ఉంటుందని; భక్తి పాటలకు శ్రుతిని, రాగాన్ని, లయని సవరించుకొని పాడే సౌలభ్యత వుందని, అదే సినిమా పాటలైతే సంగీత దర్శకుడు బాణీ కట్టిన స్థాయిలోనే, ఆర్కెస్ట్రా ప్రాక్టీసు చేసిన స్థాయిలోనే పాడాల్సి ఉంటుందని వాణిజయరాం చెబుతుంటారు. భక్తి పాటలకు ఉచ్చారణ, సందర్భం, నేటివిటీ, రాగ ఛాయలు చాలా ముఖ్యమని, సంస్కృత పదాలను శబ్దాలంకార పూర్వకంగా వుచ్చరించాల్సి ఉంటుందని వాణి అభిప్రాయం. తనకి స్థానిక భాష రాకున్నా, పదోచ్చారణ, భావం అడిగి తెలుసుకొని ప్రాక్టీసు చేసి పాడుతారు. సింగర్‌కి క్లాసికల్‌ బేస్‌ వుంటే రాగ లక్షణాలు అర్థమౌతాయి కనుక మంచి అవుట్‌ పుట్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని వాణిజయరాం అంటారు. ఇప్పుడు వాణిజయరాం ఎక్కువగా భక్తి గీతాల ఆల్బం రికార్డింగు మీద, శాస్త్రీయ సంగీత కచేరీలు చెయ్యటం పై దృష్టి సారించారు.

తెలుగుదనం నిండిన గళం...

తెలుగులో వాణిజయరాంకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు లెక్క కట్టలేం. ‘స్వప్నం’, ‘అంతులేని కథ’, ‘మరోచరిత్ర’, ‘ఘర్షణ’, ‘మల్లెపూవు’, ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘ సీతాకోక చిలక’, ‘పూజ’, ‘శ్రుతిలయలు’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. ఆమె ప్రముఖ కథక్‌ మేస్ట్రో పండిట్‌ బిర్జు మహారాజ్‌తో అనేక ఆల్బమ్‌లు చేశారు. పది వేలకు పైగా పాటలు పాడిన వాణిజయరాంకి ‘పద్మ’ పురస్కారం ఇవ్వకపోవటం, పుంభావ సరస్వతిని అవమానించినట్లే భావించాలి. వాణిజయరాం భర్త జయరాం మంచి సితార్‌ వాద్యకారుడు. వీరికి సంతానం లేదు. అందుకే తాము ఆర్జించిన సొమ్మును ఎన్నో సంఘసేవా కార్యక్రమాలకు, అనాధ పిల్ల సంరక్షణకు, చదువులకు వినియోగిస్తుంటారు. వాణిజయరాం చాలా సాధారణంగా వుంటారు. సౌమ్యశీలి. ఇంటి పనుల కోసం ఎవరి మీద ఆధారపడరు. వంటపనులు, ఇంటి పనులు స్వయంగా చక్కదిద్దుకుంటారు. అనారోగ్యంతో వాణి భర్త జయరాం ఇటీవలే కాలం చేశారు. వాణిజయరాం మంచి కవయిత్రి, పెయింటర్‌ కూడా. వాణిజయరాం నిండు నూరేళ్లు జీవించి ఆజన్మాంతం కళాసేవలో తరించాలని ఆశిద్దాం.

వాణిజయరాం అలరించిన కొన్ని తెలుగు పాటలు...

* ఆలోకయే శ్రీ బాల కృష్ణం (తరంగం) ... శ్రుతిలయలు
* అలలు కలలు ఎగసి ఎగసి ... సీతాకోకచిలక
* ఆనతినీయరా హరా ... స్వాతికిరణం
* అందెలరవమిది పదములదా ... స్వర్ణకమలం
* బ్రోచేవారేవరురా (మైసూర్‌ వాసుదేవాచారియర్‌ కృతి)... శంకరాభరణం
* దొరకునా ఇటువంటి సేవ ... శంకరాభరణం
* ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ... పూజ
* ఇన్నిరాసుల యునికి ... శ్రుతిలయలు
* జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా... స్వాతికిరణం
* కురిసేను విరిజల్లులే... ఘర్షణ
* మానస సంచరరే ... శంకరాభరణం
* మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా ... సీతాకోకచిలక
* నింగి నేల ఒకటాయెలే ... పూజ
* నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా .. వయసు పిలిచింది
* నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా ... మల్లెపూవు
* నేనా పాడనా పాటా ... గుప్పెడు మనసు
* ఒక బృందావనం ... ఘర్షణ
* పూజలు చేయ పూలు తెచ్చాను ... పూజ
* ప్రణతి ప్రణతి ప్రణతి ... స్వాతికిరణం
* సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే ... సీతాకోక చిలక
* శ్రీ సూర్యనారాయణా మేలుకో ... మంగమ్మగారి మనవడు
* శ్రుతినీవు గతి నీవు ... స్వాతికిరణం
* తెలుమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ... స్వాతికిరణం
* ఏ పాట నే పాడనూ ... సీతామాలక్ష్మి విధిచేయు వింతలన్నీ ... మరోచరిత్ర

- ఆచారం షణ్ముఖాచారి

5, నవంబర్ 2020, గురువారం

AR Rahman melodies


ఏ.ఆర్‌. రెహమాన్‌ అనగానే ‘చిన్ని చిన్ని ఆశ…’ నుంచీ ‘చిట్టి చిట్టి రోబో’ వరకూ ఎన్నో పాటలు మనసుకు స్ఫురిస్తాయి. ఆ పాటల్లో భారతీయత వినిపిస్తుంది. పాశ్చాత్యం వీనుల విందు చేస్తుంది. రెండూ కలగలిసి ఓ నవ్యత ఆవిష్కృతమవుతుంది. రెహమాన్‌ పాటకు ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా అతడి బృందం వివిధ నగరాల్లో స్టేజీషోలలో పాటల్ని ఆలపించనుంది. అందులో తొలి అడుగు (నవంబరు 26న) హైదరాబాద్‌లో వేస్తున్న వేళ రెహమాన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు…

రెహమాన్‌ తండ్రి ఆర్‌.కె.శేఖర్‌, తల్లి కస్తూరి. శేఖర్‌ సంగీత దర్శకుడు. శేఖర్‌ తండ్రి ఆలయాల్లో భజనలు చేసేవారు. నాలుగేళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు రెహమాన్‌. తండ్రి ట్యూన్‌ని అనుకరించడమే కాకుండా, దాన్ని తనకు నచ్చినట్టు మార్చేవాడు కూడా.

* రెహమాన్‌ తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లోని వాద్య పరికరాలను అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. ‘ఆ పరికరాలను అమ్మేయొచ్చుగా’ అని ఎవరైనా సలహా ఇస్తే, ‘మా అబ్బాయి ఉన్నాడుగా’ అని చెప్పేదట. 11 ఏళ్ల నుంచే వేరువేరు సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు రెహమాన్‌. 14 ఏళ్లపుడు దూర్‌దర్శన్‌ ‘వండర్‌ బెలూన్‌’ కార్యక్రమంలో నాలుగు కీబోర్డులు ఒకేసారి ప్లేచేస్తూ కనిపించాడు.

* పనిలోపడి రోజూ స్కూల్‌కి వెళ్లలేకపోయేవాడు రెహమాన్‌. దాంతో స్కూల్లో టీచర్లు కోప్పడేవారట. సంగీత దర్శకులంతా సొంత పరికరాలు కొనుక్కోవడంతో కొన్నాళ్లకు వీరి అద్దె పరికరాలకు డిమాండ్‌ తగ్గింది. ఆ సమయంలో ప్లస్‌వన్‌లో ఉన్న రెహమాన్‌ని చదువు మాన్పించి సంగీతంమీదే దృష్టి పెట్టమని చెప్పిందట తల్లి. ఆ విషయంలో రెహమాన్‌కి మొదట్లో అసంతృప్తి ఉండేది. కొంత డబ్బు సంపాదించి మళ్లీ చదువుకోవాలనుకునేవాడు. కాలేజీ చదువులేని లోటు తనను జీవిత పాఠాలు నేర్చుకునేలా చేసిందంటాడు రెహమాన్‌.

* సంగీత దర్శకుడు రమేష్‌ నాయుడు దగ్గర సెకండ్‌ కీబోర్డు ప్లేయర్‌గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో సొంత వాద్య పరికరాల్ని కొన్నాడు. అవే అతడి భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇళయరాజా, రాజ్‌-కోటి మొదలైన వారి బృందాల్లోనూ కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశాడు.

రెహమాన్‌ అయ్యాడిలా

రెహమాన్‌ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఒకప్పుడు వాళ్లింట్లో హిందూ దేవుళ్ల చిత్రాలతోపాటు, మేరీమాత, మక్కా మదీనా చిత్రాలూ ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత స్వాంతన కోసం ఆలయాలూ, చర్చిలూ, దర్గాలకు తిరగడం ఎక్కువైంది. నెల్లూరు దగ్గరి తడ ప్రాంతంలో ఉండే సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం సూఫీ వైపు మళ్లింది.

* దిలీప్‌ కుమార్‌ పేరు రెహమాన్‌కి నచ్చేది కాదట. తనలోని వ్యక్తికీ, దిలీప్‌ అనే పేరుకీ పోలికలేదనుకునేవాడు. సూఫీ విధానంలోకి మారకముందే రెహమాన్‌ చెల్లి పెళ్లి విషయమై ఓ జ్యోతిష్కుణ్ని కలవడానికి తల్లితోపాటు వెళ్లినపుడు పేరు మార్చుకోవాలనుకుంటున్నట్టు జ్యోతిష్కుడికి చెబితే, రెహమాన్‌ వైపు చూసి… ‘భలే వింతగా ఉన్నావయ్యా నువ్వు’ అంటూ… ‘అబ్దుల్‌ రెహమాన్‌, అబ్దుల్‌ రహీమ్‌… ఈ రెంటిలో ఏ పేరైనా నీకంతా మంచి జరుగుతుంది’ అన్నాడట. దిలీప్‌కు రెహమాన్‌ పేరు బాగా నచ్చింది. అలా ఓ హిందూ జ్యోతిష్కుడు అతడికి ముస్లిం పేరు పెట్టాడు. ఆ పేరు ముందు అల్లారఖా అని పెడితే బావుంటుందని అతడి తల్లికి అనిపించింది. అలా 23 ఏళ్ల వయసులో దిలీప్‌ కుమార్‌ కాస్తా ‘అల్లా రఖా రెహమాన్‌’ అయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు కస్తూరి తన పేరును కరీమా బేగంగా మార్చుకుంది.

* 1990లో రెహమాన్‌కు ‘మల్టీ ట్రాక్‌ రికార్డర్‌’ కొనడం కోసం, కూతురి పెళ్లికని దాచిన తన నగల్ని అమ్మడానికీ వెనకాడలేదు కరీమా. రెహమాన్‌కు ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్లు. అక్క కొడుకే యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌. 1987లో చెన్నైలోని కోడంబాకం ఇంటికి వచ్చిన రెహమాన్‌ కుటుంబం, అప్పట్నుంచీ అదే ఇంట్లో ఉంటోంది. ప్రతి శుక్రవారం ఇంటి దగ్గర ఉచితంగా బిర్యానీ పంచుతారు.

ప్రకటనలకు పనిచేశాడు. సినిమాల్లోకి రాకముందే 300 ప్రకటనలకు పనిచేశాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్‌ జింగిల్స్‌ చేసేవాడు. వారి ద్వారానే రెహమాన్‌కు మణిరత్నంతో పరిచయమైంది.

* రోజాకి అందుకున్న మొత్తం రూ.25వేలు. ‘రోజా’ సమయంలో మణిరత్నంకి రెహమాన్‌ తన చిన్న గదిలోని స్టూడియోలో పాటలు వినిపించాడు. పాతికేళ్ల తర్వాత ఈ ఏడాది ‘చెలియా’ ట్యూన్‌లను విమానంలో ప్రయాణిస్తూ వినిపించాడు. ఈ పాతికేళ్లలో మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ సంగీతం అందించింది రెహమానే.

* పాటకి పల్లవి, చరణం ఉండాలన్న సంప్రదాయాన్ని రోజాలోని ‘నాగమణీ’ పాటతోనే చెరిపేశాడు.

ఆరంభం అదిరింది

తొలి చిత్రం ‘రోజా’తోపాటు మెరుపు కలలు, లగాన్‌, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నాడు. హిందీలో నేరుగా సంగీతం అందించిన మొదటి సినిమా ‘రంగీలా’.

* కేంద్ర ప్రభుత్వం 2010లో ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది.

* రెహమాన్‌కి ముందు వరకూ సినిమా పాట నిర్మాత సొంతం, రెహమాన్‌ వచ్చాక అవి సంగీత దర్శకుల సొంతమయ్యేలా మార్చాడు.

* చిన్న పిల్లలతో పాడించడం ఇష్టం. తన మేనల్లుడి చేత జెంటిల్‌మేన్‌లో ‘చికు బుకు చికు బుకు రైలే’… పాడించాడు. తాజాగా ‘అదిరింది’లోనూ ఓ పిల్లాడితో పాడించాడు.

* రెహమాన్‌కి వాళ్ల నాన్న ఇచ్చిన కీబోర్డ్‌ ఇప్పటికీ అతడి స్టూడియోలో ఉంది.

* కేఎమ్‌ మ్యూజిక్‌ కన్జర్వేటరీ పేరుతో చెన్నైలో ఒక సంగీత పాఠశాలను ప్రారంభించాడు. వీరి స్కూల్లో స్థానిక పాఠశాల విద్యార్థులకు సంగీతంలో ఉచిత శిక్షణ ఇస్తారు.

* కోల్డ్‌ప్లే, అడీల్‌, జయాన్‌ మాలిక్‌ల సంగీతం వింటాడు. ‘ది కార్పెంటర్స్‌’… రెహమాన్‌ కొన్న మొదటి సీడీ.

* 1997లో దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ‘వందేమాతరం’ ఆల్బమ్‌ చేశాడు.

* 2005లో టైమ్‌ మ్యాగజైన్‌ ‘10 బెస్ట్‌ సౌండ్‌ట్రాక్స్‌’ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌లో ‘రోజా’ ఒకటి. రెహమాన్‌ను 2009లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగానూ గుర్తించింది.

* రెహమాన్‌ గౌరవార్థం 2013లో కెనడాలోని ఒంటారియా రాష్ట్రంలో ఒక వీధికి అతని పేరు పెట్టారు. భార్యా పిల్లలు…

రెహమాన్‌ భార్య పేరు సైరాబాను. వీరికి ఇద్దరు అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

రజినీ అభిమాని

రాత్రిళ్లు పనిచేయడం రెహమాన్‌కు నచ్చుతుంది. రోజూ ఉదయం 5:30కి ప్రార్థన చేస్తాడు. అర్ధరాత్రి రెండూ మూడు వరకూ ఉండి ఉదయాన్నే మళ్లీ నిద్ర లేవడం కష్టమని అంతవరకూ మేల్కొని ఉండి ప్రార్థన చేసి నిద్రపోతాడు.

తమిళ నీతి పద్య గ్రంథం ‘తిరుక్కురళ్‌’ బాగా చదువుతాడు. బాణీలు రానపుడు ఆ పద్యాల్లో ఒకదానికి బాణీ కడుతూ తనకు కావాల్సింది సృష్టించుకుంటాడు.

* లాస్‌ ఏంజెలెస్‌లో ఒక ఇల్లు ఉంది. పని ఒత్తిడి నుంచి సేదదీరుతూ, సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ఆత్మపరిశీలన చేసుకోవడానికీ అక్కడికి వెళ్తానంటాడు.

* రజనీకాంత్‌ అభిమాని. ఆయన నమ్మే చాలా సిద్ధాంతాలనే తనూ నమ్ముతానంటాడు. అనుభవాలనుంచి పాఠాల్ని నేర్చుకోవడం ఆయన్నుంచే తెలుసుకున్నాడట.

* మైఖేల్‌ జాక్సన్‌ని రెండు సార్లు కలిసి మాట్లాడాడు. ఫోన్లో కూడా మాట్లాడుకునేవారట. జాక్సన్‌ని ఇబ్బంది పెట్టకూడదనీ ఫొటో అడగలేదని చెప్పే రెహమాన్‌ అది తీరని కోరిక అంటాడు. ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్టు చేయాలని అనుకున్నారట కూడా!

* సూఫీ సంగీతం నేర్చుకున్నాక తన ప్రపంచం మరింత విస్కృతమైందని చెప్పే రెహమాన్‌… తనపైన గజల్స్‌ గాయకుడు నుస్రత్‌ ఫతే అలీఖాన్‌ ప్రభావం ఉందంటాడు.

* సుభాష్‌ ఘాయ్‌ సూచనతో హిందీ పద్యాలూ, దోహాలను చదువుతూ ఆ భాషపైన పట్టు సాధించిన రెహమాన్‌ తర్వాత ఉర్దూ, పంజాబీ నేర్చుకోవడంపైనా దృష్టిపెట్టాడు.

* ఎయిర్‌టెల్‌ వాణిజ్య ప్రకటన కోసం రెహమాన్‌ స్వరపర్చిన ట్యూన్‌… ప్రపంచంలోనే అత్యధికంగా 15 కోట్ల డౌన్‌లోడ్లు నమోదు చేసింది.

* తన స్టేజి షోలూ, ఇతర లైవ్‌షోల వీడియోలు చూడ్డం మొదలుపెట్టాక తన శైలి మార్చుకున్నానంటాడు రెహమాన్‌. ‘అవి ఎంతో బోరింగ్‌గా అనిపించేవి. నేను స్టేజిమీద కదులుతూ ప్రేక్షకులతో ఇంకాస్త కలిసిపోతే బావుంటుందనిపించింది’ అని చెబుతాడు రెహమాన్‌. మహా సిగ్గరి అయిన రెహమాన్‌ ఓ షోలో స్టేజి దిగి ముందు వరుసలో ఉన్న అమ్మాయిని ‘హౌ మచ్‌ డు యూ లైక్‌ మ్యూజిక్‌? డూ యు లవ్‌ మి?’ అని ప్రశ్నలు వేశాడంటే ఎంత మారాడో అర్థం చేసుకోవచ్చు.

* కాన్సర్ట్‌ల కోసం స్టైలింగ్‌ కూడా మెరుగుపర్చుకున్నాడు. 2010 నుంచి భార్య సైరానే రెహమాన్‌కి స్టైలిస్ట్‌గా ఉంటోంది. కాన్సర్ట్‌కి సిద్ధమవుతూ, యువ మ్యుజీషియన్స్‌ నుంచి కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకుంటాడు. ముందు రోజు బాగా నిద్రపోతాడు కూడా, లేదంటే గొంతు సరిగ్గా రాదంటాడు. రెహమాన్‌ సినిమా పాటలూ, లైవ్‌షోలూ, స్టేజి షోలన్నీ కలిసి ‘ఓపెన్‌ హార్ట్‌’ పేరుతో సినిమాగానూ వచ్చింది.

* వర్చువల్‌ రియాలిటీ సినిమా ‘లే మస్క్‌’ తీస్తున్నాడు. భార్యతో కలిసి దీనికి కథ రాసిన రెహమాన్‌, మొదటిసారి దర్శకుడిగా మారాడు.

* ‘బోంబే డ్రీమ్స్‌’ మొదటి అంతర్జాతీయ ఆల్బమ్‌. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌, పీలే, 127 అవర్స్‌… లాంటి 13 హాలీవుడ్‌ సినిమాలకు సంగీతం అందించాడు. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌… రెండు ఆస్కార్లూ, రెండు గ్రామీల్నీ, బాఫ్టా, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్నీ తెచ్చింది. ఒకే ఏడాది రెండు ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి రెహమాన్‌

అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

Feedback on WhatsApp

31, అక్టోబర్ 2020, శనివారం

స్మార్ట్ ఫోన్ CAMERA గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు



1 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ప్రస్తుతం, స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందుగా ఆ స్మార్ట్ ఫోన్ గురించి మనం ఆలోచించాల్సిన లేదా గమనించాల్సిన ముఖ్యమైన విషయాలలో Smartphone Camera ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రతిఒక్కరికి తెలిసిన విషయమే. ముందుగా, మనం కొనాలనుకున్న స్మార్ట్ ఫోన్ లో వున్నా కెమేరాల గురించి ఆరా తీసిన తరువాతనే ఆ స్మార్ట్ ఫోన్ను కోనాలా? వద్దా అని ఆలోచిస్తుంటాం. అంతగా, కెమేరాలు మరియు ఫీచర్లు ఒక స్మార్ట్ ఫోన్ అమ్మకాలను నిర్ణయిస్తాయి. 

 2 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అయితే, ఎక్కువ మంది నమ్మే విషయం ఏమిటంటే, ఎక్కువ మెగాపిక్సెల్స్ గల కెమేరాలు గొప్ప ఫోటోలను తియ్యగలవని నమ్ముతారు. అయితే, నిజానికి ఇది అక్షరాలా అవాస్తవం అని తెలుసుకోవడం మంచిది. మరి ఒక స్మార్ట్ ఫోన్ కెమేరాలో ఎంత సెన్సార్ ఉండాలి, ఎలాంటి సెన్సార్ ఉండాలి వంటి అనేకమైన ప్రశ్నలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. కానీ, ఈ కెమేరా ప్రత్యేక శీర్షిక చదివిన తరువాత స్మార్ట్ ఫోన్ కెమేరా గురించిన పూర్తి వివరాలను అర్ధం చేసుకోవవచ్చు. 

 3 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు 
CAMERA ప్రయోజనం : మెరుగైన కెమెరా, మీరు ఎక్కడున్నారో పట్టించుకోనక్కర్లేదు మంచి ఫోటోలు తీసుకోవచ్చు. 
 True : కొన్ని స్మార్ట్ ఫోన్ల యొక్క అతి ముఖ్యమైన అంశం కూడా కెమెరానే కావచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ల యొక్క కెమెరా ఒక “మంచి” కెమెరా అని చెప్పడానికి, అనేక అంశాలు ఉన్నాయి, అవి ఇక్కడ వివరించాను.













4 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు 
స్పష్టత (రిజల్యూషన్) ప్రయోజనం: రిజల్యూషన్ = వివరాలు ఈ రిజల్యూషన్ మీ కెమెరా యొక్క పిక్సెల్స్ సంఖ్యను సూచిస్తుంది. దీనిని తరచూగా, మెగాపిక్సల్స్ గా వ్యవహరిస్తారు, వాటి పని మీరు కోరుకుంటున్నట్లుగా అద్దంలాగా మీరు కోరుకుంటున్న దృశ్యాన్ని రికార్డ్ చేయడం.

5 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు 
అపోహ ఎక్కువ మెగాపిక్సెల్స్ గల కెమేరాలు మాత్రమే మెరుగైన చిత్రాలు తీస్తాయి

6 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు  
అసలు నిజం అధిక మెగాపిక్సెల్లు చాలా వివరాలను పొందడానికి ఉత్తమంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు, కాని ఇది నిజం కాదు. కెమెరా సెన్సార్లో మీరు ఎన్ని మెగాపిక్సెల్స్ కలిగి ఉండాలో వాటికీ ఒక పరిమితి ఉంది, అది వాటి పనిని చేయగల సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి.










7 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అర్ధమయ్యేలా చెప్పాలంటే ముగ్గురు పనిచేయడం కోసం మాత్రమే నిర్మించిన ఒక గదిలో 10 మంది వ్యక్తులతో ఆ గదిలో పని చేయిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి, ‘ఎక్కువ మెగాపిక్సెల్’ గురించి వాదనలు చేయకుండా నిజం గురించి ఆలోచించండి. ఒక 12-16 మెగాపిక్సెల్ రిజల్యూషనుతో కూడిన సెన్సార్ల ద్వారా కూడా ఉత్తమ ప్రదర్శన అందుకోవచ్చు. 

 8 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు లెన్స్ ప్రయోజనం: మీకు క్రిస్టల్ క్లియర్, పొగమంచు రహిత చిత్రాలను సృష్టిస్తుంది. 

 9 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు LENS ఉపయోగం లెన్స్ లు కెమెరా యొక్క సెన్సార్ మీద కాంతి దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది, తద్వారా డీటెయిల్స్ పక్కాగా పదునుగా వస్తాయి. ఒక స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరాలలో సాధారణంగా ప్లాస్టిక్ కటకములను ఉపయోగిస్తారు. కానీ, ఖరీదైన కెమెరాలలో ప్లాస్టిక్ కటకముల స్థానంలో ఉత్తమమైన గాజు కటకములను వాడతారు. కొన్నిసార్లు, మీరు కెమెరాల వివరాలలో Leica బ్రాండింగ్ లేదా Zeiss వంటి వాటిని చూస్తారు. ఈ సందర్భంలో మీరు ఉత్తమమైనది పొందుతున్నారని హామీ పొందవచ్చు.











10 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఎపర్చరు ప్రయోజనం: మీకు ఎల్లప్పుడూ తక్కువ కాంతిలో కూడా ఫోటోలను తీసుకోవడంలో సహాయం చేస్తాయి. లెన్స్ యొక్క ప్రారంభ పరిమానాన్ని (ద్వారాన్ని) ఎపర్చరు అని పిలుస్తారు, దీనిని f / 1.4 లేదా f / 2.0 లేదా f / 2.8 గా వ్రాస్తారు. లెన్స్ యొక్క ఎపర్చరు సంఖ్యను చూడండి. చిన్న సంఖ్య, మరింత కాంతిని, కెమెరా లోకి అనుమతిస్తుంది తద్వారా తక్కువ కాంతిలో చక్కని చిత్రాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, 1.4 యొక్క ద్వారం 1.8 కన్నా మెరుగైనది, ఇంకా ఇది 2.4 కన్నా మరింత మెరుగైనది. 
  
11 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఫోకస్ పద్ధతి ప్రయోజనం: ఫోకస్ చాలా నెమ్మదిగా ఉన్నందున మీరు విలువైన షాట్స్ ఎప్పటికీ కోల్పోరని అర్ధంచేసుకోండి. దృష్టి సారించే విధానం బట్టి అది అస్పష్టమైన ఫోటోలతో ముగుస్తుంది. అక్కడ అనేక దృష్టి సాంకేతికతలు ఉన్నాయి, డ్యూయల్ పిక్సెల్ AF వేగవంతమైనది మాత్రమే కాదు, మంచి కాంతి మరియు తక్కువ కాంతిలో కూడా అత్యంత నమ్మకమైనది. Phase Detect Auto Focus, PDAF అని కూడా పిలిచే ఈ సాంకేతికత కూడా మంచిది మరియు మీకు నమ్మకమైనదిగా కూడా ఉంటుంది. 

12 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు డ్యూయల్ కెమెరా ప్రయోజనం: మీ ఖచ్చితమైన జ్ఞాపకాలను తియ్యడానికి మరిన్ని కెమెరాలు మీకు ఎక్కువ మార్గాలు అందిస్తాయి. రెండు కెమెరాలను జోడించడం ద్వారా, ఫోటోగ్రఫీ అనుభవం బాగా మెరుగుపడింది. డ్యూయల్ కెమెరా ఫోన్లు సాధారణంగా రెండవ లెన్స్ యొక్క రకాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటాయి అవి; ఒకటి మీకు అదనపు ఫోకల్ పొడవు (Telephoto లేదా ultrawide) ఇస్తుంది మరియు మరొకటి ఒక మోనోక్రోమ్ సెన్సార్ కలిగి ఉంటుంది. మోనోక్రోమ్ సెకండరీ సెన్సార్లతో ఉన్న కెమెరాలు మీకు నలుపు మరియు తెలుపు ఫోటోగ్రఫీ ఇస్తాయి, కెమెరాలో రెండు వేర్వేరు అభిప్రాయాలతో రెండు కెమెరాలు కలిగి ఉండటం మంచి చిత్రాలకు దారి తీస్తుంది.












13 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ట్రిపుల్ కెమెరా ప్రయోజనం: మీకు జూమ్ మరియు పదునైన చిత్రాలకు సామర్ధ్యం ఇస్తుంది. ఒక ట్రిపుల్-కెమెరా సెటప్ మీకు మంచి సౌలభ్యాన్ని అందిస్తుంది, జూమ్, వైడ్ యాంగిల్ లెన్స్ మరియు కళాత్మక ఫోటోల కోసం ఒక నలుపు మరియు తెలుపు సెన్సార్ను కూడా అందిస్తుంది. డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ను పరిగణనలోకి తీసుకొని మీరు వివాదాస్పదంగా ఉంటే ఇది మీరు సమాధానంగా ఉంటుంది. 

14 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు క్వాడ్ కెమేరా ఇక ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న ఈ విధమైన కెమెరాల విషయానికి వస్తే, ఇవి మీకు ఎక్కువ ఫోటోగ్రఫీ అప్షన్లను అందిస్తాయి. ఎందుకంటే, ఈ కెమేరా సెటప్పులో మీకు అనేక రకాలైన లెన్సులు అనేకరకాలైన పనులను చేయగలిగే సామర్ధ్యాలతో వస్తాయి. 

15 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పోర్ట్రైట్ మోడ్ ప్రయోజనం: మీ స్మార్ట్ ఫోన్ కెమెరా నుండి DSLR లాంటి పోర్ట్రెయిట్స్ పొందడం. పోర్ట్రైట్ మోడ్, లేదా బోకె మోడ్ అనేది ఫోటోగ్రఫీ యొక్క రకం, ఇది వ్యక్తిని స్పష్టంగా చూపిస్తూ మిగిలిన బ్యాగ్రౌండ్ ని అస్పష్టం చేస్తుంది. మంచి పోర్ట్రైట్ షాట్ల కోసం కెమెరాకి రెండు లెన్సల సెటప్ అవసరం, ఇది అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలను అందించడానికి సాఫ్ట్ వేర్ తో కలిసి పనిచేస్తుంది. హార్డ్వేర్ కన్నా సాఫ్ట్ వేర్ పై ఈ ఫీచర్ ఎక్కువ ఆధారపడుతుంది కాబట్టి, డ్యూయల్ కెమెరా సెటప్ రకం గురించి నిజంగా పెద్దగా పట్టింపు లేదు. వాస్తవానికి, గూగుల్ పిక్సెల్ 3A XL కేవలం ఒక కెమెరాని కలిగి ఉన్నప్పటికీ అద్భుతమైన పోర్ట్రైట్ మోడ్ ఫోటోలను అందిస్తుంది, ఇది కేవలం దాని సాఫ్ట్వేర్ సహాయంతో మాత్రమే చెయ్యగలుగుతుంది. 

16 - స్మార్ట్ ఫోన్ Camera గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు సెల్ఫీ కెమెరా ప్రయోజనం: ఎవరి సహాయం లేకుండా మీ స్వంత ఫోటోలను తీసుకోవడం చాలా సులభం. మీ స్మార్ట్ ఫోనులో ముందుభాగంలో వుండే కెమెరా మీకు కావాల్సిన విధంగా బ్యూటిఫికెషన్ మోడ్తో మీ స్కిన్ యొక్క రంగులు దిద్దుకునే విధంగా, మరియు మీ ముఖం మెరిసేలా తయారు చేసే కొన్ని చక్కని ఫీచర్లతో వస్తాయి. సెల్ఫీ కెమెరా వెనుక కెమెరాలాగా ముఖ్యమైనదిగా భావించిన వినియోగదారులలో మీరు కూడా ఒకరైతే, మీరు Oppo మరియు Vivo లాంటి ఫోన్ల ద్వారా అందించే ఫ్రంట్ ఫ్లాష్ తో కూడిన ఒక కెమెరా ఉంచాలని నిర్ధారించుకోండి. అనేక స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు ముందువైపు డ్యూయల్ కెమెరాను ఉపయోగించి పోర్ట్రెయిట్ మోడ్ను కూడా అందిస్తున్నాయి, ఇది మీకు అదనపు ప్రయోజనం కూడాను అనుకూలమైన చిట్కా: కొన్నిసార్లు బ్యూటీ ఫిల్టర్లు వాళ్ళ చర్మం ప్లాస్టిక్ లాగా కనిపించేలా చేస్తాయి, కాబట్టి మీరు సరైన అమరికను ఉపయోగించారని ముందుగా నిర్ధారించుకోండి

30, అక్టోబర్ 2020, శుక్రవారం

వేటూరి పాట మనస్సు నిండే మాట


ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు.

రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో, సరిపోలేదో…? అందుకే సాగరం సాగరంలా; ఆకాశం ఆకాశంలా; రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలా ఉంటుదని తేల్చేసి అద్భుతంగా పోలుస్తాడు. నా బోటి అల్పజ్ఞానులకు దిక్సూచి అవుతాడు. అందుకే….

వేటూరి పాట వేటూరి పాటలా ఉంటుంది…!

పాటలన్నీ గుర్తు చేయడానికి సినీసాహిత్యం మీద జ్ఞానంగానీ, భావంగానీ, అధారిటీ గానీ నాకు లేవు, రావు..! కానీ ఏనుగంత సైజులో, ఎలకకున్నంత చురుకైన చెవులున్నాయి.

యమకాలూ; గమకాలూ; నానార్ధాలూ; జతులూ; కృతులూ; తరంగాలూ; అలంకారాలూ; మమకారాలూ; నుడికారాలూ; జానపదాలూ; జ్ఞానపథాలూ; ఛందస్సూ; వయస్సూ; మనస్సూ అన్నీ ఓవర్ ఫ్లో అయ్యే భోగీ, యోగీ వేటూరి.

“ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో” అంటూ మణిరత్నం సినిమా కథని; “సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణమూ..” అంటూ విశ్వనాథ్ గారి సినిమా కధనీ ఒఖ్క వాక్యంలో తేల్చేయగల స్రష్ట వేటూరి.

“కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్తపూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు..?” అని అంటూనే, “రాలిపోయె పువ్వానీకు రాగాలెందుకే” అని తికమక పెట్టేసి, “నేడేరా నీకు నేస్తమూ రేపేలేదూ” అని మన వెన్నును నిటారు చేసి, “గాలినై పోతాను గగనానికీ” అంటూ నిర్వేదంతో కూలబడేసే క’పాట’ నాటక సూత్రధారి వేటూరి.

సాహిత్యం నాట్యంలో అభినివేశం ఉన్న జాణతో “నిన్నటిదాకా శిలనైనా, నీ పదముసోకి నే గౌతమినైనా” అంటూ అతిశయోక్తులు చెప్పించి పెళ్లాన్నొదిలొచ్చేలా చేయించి; వేశ్యతో “పట్టుమనీ పదారేళ్లురో, నా సామీ కట్టుకుంటే మూడే ముళ్లురో..!” అని కమిట్ చేయిద్దామనుకునే రసిక శిఖామణి వేటూరి.

“సిరిమల్లెపూవా..! అంటూ ముగ్ధలా; చీకటింట దీపామెట్టీ, చీకుచింత పక్కానెట్టీ, నిన్ను నాలో దాచీపెట్టీ, నన్ను నీకు దోచిపెట్టీ..” అంటూ ప్రేయసిలా; ” నడిరాతిరివేళా నీ పిలుపూ.. గిలిగింతలతో నను ఉసిగొలుపూ..!” అంటూ ఇల్లాలిలా బహుముఖీయ స్త్రీత్వాన్ని ప్రకటించిన వాడు వేటూరి.

ఓ దగ్గర “పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ” అంటాడు. మరోదగ్గర రామాచిలకమ్మా పాటలో “వేణువంటే వెర్రిగాలి పాటేలే..” అంటూ తేల్చేస్తాడు. ఇంకోదగ్గర కాదిలి వేణుగానం గురించి డబ్బింగ్ సినిమా పాటలో చెబుతాడు. “వేణుగానమేదో యెంకి పాటలాయె” అంటూ జగదేకవీరుడితో పాడిస్తాడు. చివరగా ” వేణువై వచ్చాను భువనానికీ.. గాలినై పోతాను గగనానికీ ” అంటూ సినీబృందావనపు రేపల్లె ఎద జల్లుమనేలా మురళీ గానం చేస్తూ అవతార సమాప్తి చేసిన సినీకృష్ణుడు వేటూరి..!

పంచమహాకావ్యాలలో ఒకటైన కిరాతార్జునీయాన్ని ఐదునిమిషాల పాటగా మార్చి మనకందించిన భారతీసుతభారవి వేటూరి..!

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానాన్ని శంకరుడిచే అవధరింపజేసి వినితరించేలా చేసిన శివతత్వం వేటూరి..!

సినీమీటరు సాహిత్యసాగరాన్నంటినీ అవపోసన పట్టిన అగస్త్యుడు వేటూరి..!

కొందరు విజ్ఞమూర్ఖులు వేటూరి కలానికి రెండు వైపులా పదునున్న కత్తి అంటారు, కానీ ఈ మూర్ఖవిజ్ఞుడు దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాడు.

వేటూరి కలం అన్నివైపులా పదునున్న సుదర్శనం…!🙏

ఆయన కలంతో అక్షరీకరింపబడ్డ గగనజఘనాల ఇందువదనల అందం రవివర్మ కుంచెక్కూడా అందదు.

ఆయన గురించి అక్షరీకరించడానికి నాకు గగనం కూడా సరిపోదు.


నరుని బతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
మనకెందుకింత తపన….??


ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..?


మీ గానలహరి మేమ్మునుగంగా
ఆనందవృష్టి లో తడవంగా…


చినుకులా రాలి నదులుగా మారి
వరదలైపోయి కడలిలా పొంగె
నీ పాటా.. నీ పాటా…!


నూటికో కోటికో ఒక్కరూ
ఎక్కడో ఎప్పుడూ పుడతారూ
అది మీరేమీరే వేటూరీ.

తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం


మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.

గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే కేరళ లోని దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.

అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.

ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.

గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.

నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.

కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.

కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .

గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.

సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది!