5, నవంబర్ 2020, గురువారం

AR Rahman melodies


ఏ.ఆర్‌. రెహమాన్‌ అనగానే ‘చిన్ని చిన్ని ఆశ…’ నుంచీ ‘చిట్టి చిట్టి రోబో’ వరకూ ఎన్నో పాటలు మనసుకు స్ఫురిస్తాయి. ఆ పాటల్లో భారతీయత వినిపిస్తుంది. పాశ్చాత్యం వీనుల విందు చేస్తుంది. రెండూ కలగలిసి ఓ నవ్యత ఆవిష్కృతమవుతుంది. రెహమాన్‌ పాటకు ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా అతడి బృందం వివిధ నగరాల్లో స్టేజీషోలలో పాటల్ని ఆలపించనుంది. అందులో తొలి అడుగు (నవంబరు 26న) హైదరాబాద్‌లో వేస్తున్న వేళ రెహమాన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు…

రెహమాన్‌ తండ్రి ఆర్‌.కె.శేఖర్‌, తల్లి కస్తూరి. శేఖర్‌ సంగీత దర్శకుడు. శేఖర్‌ తండ్రి ఆలయాల్లో భజనలు చేసేవారు. నాలుగేళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు రెహమాన్‌. తండ్రి ట్యూన్‌ని అనుకరించడమే కాకుండా, దాన్ని తనకు నచ్చినట్టు మార్చేవాడు కూడా.

* రెహమాన్‌ తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లోని వాద్య పరికరాలను అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. ‘ఆ పరికరాలను అమ్మేయొచ్చుగా’ అని ఎవరైనా సలహా ఇస్తే, ‘మా అబ్బాయి ఉన్నాడుగా’ అని చెప్పేదట. 11 ఏళ్ల నుంచే వేరువేరు సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు రెహమాన్‌. 14 ఏళ్లపుడు దూర్‌దర్శన్‌ ‘వండర్‌ బెలూన్‌’ కార్యక్రమంలో నాలుగు కీబోర్డులు ఒకేసారి ప్లేచేస్తూ కనిపించాడు.

* పనిలోపడి రోజూ స్కూల్‌కి వెళ్లలేకపోయేవాడు రెహమాన్‌. దాంతో స్కూల్లో టీచర్లు కోప్పడేవారట. సంగీత దర్శకులంతా సొంత పరికరాలు కొనుక్కోవడంతో కొన్నాళ్లకు వీరి అద్దె పరికరాలకు డిమాండ్‌ తగ్గింది. ఆ సమయంలో ప్లస్‌వన్‌లో ఉన్న రెహమాన్‌ని చదువు మాన్పించి సంగీతంమీదే దృష్టి పెట్టమని చెప్పిందట తల్లి. ఆ విషయంలో రెహమాన్‌కి మొదట్లో అసంతృప్తి ఉండేది. కొంత డబ్బు సంపాదించి మళ్లీ చదువుకోవాలనుకునేవాడు. కాలేజీ చదువులేని లోటు తనను జీవిత పాఠాలు నేర్చుకునేలా చేసిందంటాడు రెహమాన్‌.

* సంగీత దర్శకుడు రమేష్‌ నాయుడు దగ్గర సెకండ్‌ కీబోర్డు ప్లేయర్‌గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో సొంత వాద్య పరికరాల్ని కొన్నాడు. అవే అతడి భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇళయరాజా, రాజ్‌-కోటి మొదలైన వారి బృందాల్లోనూ కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశాడు.

రెహమాన్‌ అయ్యాడిలా

రెహమాన్‌ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఒకప్పుడు వాళ్లింట్లో హిందూ దేవుళ్ల చిత్రాలతోపాటు, మేరీమాత, మక్కా మదీనా చిత్రాలూ ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత స్వాంతన కోసం ఆలయాలూ, చర్చిలూ, దర్గాలకు తిరగడం ఎక్కువైంది. నెల్లూరు దగ్గరి తడ ప్రాంతంలో ఉండే సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం సూఫీ వైపు మళ్లింది.

* దిలీప్‌ కుమార్‌ పేరు రెహమాన్‌కి నచ్చేది కాదట. తనలోని వ్యక్తికీ, దిలీప్‌ అనే పేరుకీ పోలికలేదనుకునేవాడు. సూఫీ విధానంలోకి మారకముందే రెహమాన్‌ చెల్లి పెళ్లి విషయమై ఓ జ్యోతిష్కుణ్ని కలవడానికి తల్లితోపాటు వెళ్లినపుడు పేరు మార్చుకోవాలనుకుంటున్నట్టు జ్యోతిష్కుడికి చెబితే, రెహమాన్‌ వైపు చూసి… ‘భలే వింతగా ఉన్నావయ్యా నువ్వు’ అంటూ… ‘అబ్దుల్‌ రెహమాన్‌, అబ్దుల్‌ రహీమ్‌… ఈ రెంటిలో ఏ పేరైనా నీకంతా మంచి జరుగుతుంది’ అన్నాడట. దిలీప్‌కు రెహమాన్‌ పేరు బాగా నచ్చింది. అలా ఓ హిందూ జ్యోతిష్కుడు అతడికి ముస్లిం పేరు పెట్టాడు. ఆ పేరు ముందు అల్లారఖా అని పెడితే బావుంటుందని అతడి తల్లికి అనిపించింది. అలా 23 ఏళ్ల వయసులో దిలీప్‌ కుమార్‌ కాస్తా ‘అల్లా రఖా రెహమాన్‌’ అయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు కస్తూరి తన పేరును కరీమా బేగంగా మార్చుకుంది.

* 1990లో రెహమాన్‌కు ‘మల్టీ ట్రాక్‌ రికార్డర్‌’ కొనడం కోసం, కూతురి పెళ్లికని దాచిన తన నగల్ని అమ్మడానికీ వెనకాడలేదు కరీమా. రెహమాన్‌కు ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్లు. అక్క కొడుకే యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌. 1987లో చెన్నైలోని కోడంబాకం ఇంటికి వచ్చిన రెహమాన్‌ కుటుంబం, అప్పట్నుంచీ అదే ఇంట్లో ఉంటోంది. ప్రతి శుక్రవారం ఇంటి దగ్గర ఉచితంగా బిర్యానీ పంచుతారు.

ప్రకటనలకు పనిచేశాడు. సినిమాల్లోకి రాకముందే 300 ప్రకటనలకు పనిచేశాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్‌ జింగిల్స్‌ చేసేవాడు. వారి ద్వారానే రెహమాన్‌కు మణిరత్నంతో పరిచయమైంది.

* రోజాకి అందుకున్న మొత్తం రూ.25వేలు. ‘రోజా’ సమయంలో మణిరత్నంకి రెహమాన్‌ తన చిన్న గదిలోని స్టూడియోలో పాటలు వినిపించాడు. పాతికేళ్ల తర్వాత ఈ ఏడాది ‘చెలియా’ ట్యూన్‌లను విమానంలో ప్రయాణిస్తూ వినిపించాడు. ఈ పాతికేళ్లలో మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ సంగీతం అందించింది రెహమానే.

* పాటకి పల్లవి, చరణం ఉండాలన్న సంప్రదాయాన్ని రోజాలోని ‘నాగమణీ’ పాటతోనే చెరిపేశాడు.

ఆరంభం అదిరింది

తొలి చిత్రం ‘రోజా’తోపాటు మెరుపు కలలు, లగాన్‌, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నాడు. హిందీలో నేరుగా సంగీతం అందించిన మొదటి సినిమా ‘రంగీలా’.

* కేంద్ర ప్రభుత్వం 2010లో ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది.

* రెహమాన్‌కి ముందు వరకూ సినిమా పాట నిర్మాత సొంతం, రెహమాన్‌ వచ్చాక అవి సంగీత దర్శకుల సొంతమయ్యేలా మార్చాడు.

* చిన్న పిల్లలతో పాడించడం ఇష్టం. తన మేనల్లుడి చేత జెంటిల్‌మేన్‌లో ‘చికు బుకు చికు బుకు రైలే’… పాడించాడు. తాజాగా ‘అదిరింది’లోనూ ఓ పిల్లాడితో పాడించాడు.

* రెహమాన్‌కి వాళ్ల నాన్న ఇచ్చిన కీబోర్డ్‌ ఇప్పటికీ అతడి స్టూడియోలో ఉంది.

* కేఎమ్‌ మ్యూజిక్‌ కన్జర్వేటరీ పేరుతో చెన్నైలో ఒక సంగీత పాఠశాలను ప్రారంభించాడు. వీరి స్కూల్లో స్థానిక పాఠశాల విద్యార్థులకు సంగీతంలో ఉచిత శిక్షణ ఇస్తారు.

* కోల్డ్‌ప్లే, అడీల్‌, జయాన్‌ మాలిక్‌ల సంగీతం వింటాడు. ‘ది కార్పెంటర్స్‌’… రెహమాన్‌ కొన్న మొదటి సీడీ.

* 1997లో దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ‘వందేమాతరం’ ఆల్బమ్‌ చేశాడు.

* 2005లో టైమ్‌ మ్యాగజైన్‌ ‘10 బెస్ట్‌ సౌండ్‌ట్రాక్స్‌’ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌లో ‘రోజా’ ఒకటి. రెహమాన్‌ను 2009లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగానూ గుర్తించింది.

* రెహమాన్‌ గౌరవార్థం 2013లో కెనడాలోని ఒంటారియా రాష్ట్రంలో ఒక వీధికి అతని పేరు పెట్టారు. భార్యా పిల్లలు…

రెహమాన్‌ భార్య పేరు సైరాబాను. వీరికి ఇద్దరు అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

రజినీ అభిమాని

రాత్రిళ్లు పనిచేయడం రెహమాన్‌కు నచ్చుతుంది. రోజూ ఉదయం 5:30కి ప్రార్థన చేస్తాడు. అర్ధరాత్రి రెండూ మూడు వరకూ ఉండి ఉదయాన్నే మళ్లీ నిద్ర లేవడం కష్టమని అంతవరకూ మేల్కొని ఉండి ప్రార్థన చేసి నిద్రపోతాడు.

తమిళ నీతి పద్య గ్రంథం ‘తిరుక్కురళ్‌’ బాగా చదువుతాడు. బాణీలు రానపుడు ఆ పద్యాల్లో ఒకదానికి బాణీ కడుతూ తనకు కావాల్సింది సృష్టించుకుంటాడు.

* లాస్‌ ఏంజెలెస్‌లో ఒక ఇల్లు ఉంది. పని ఒత్తిడి నుంచి సేదదీరుతూ, సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ఆత్మపరిశీలన చేసుకోవడానికీ అక్కడికి వెళ్తానంటాడు.

* రజనీకాంత్‌ అభిమాని. ఆయన నమ్మే చాలా సిద్ధాంతాలనే తనూ నమ్ముతానంటాడు. అనుభవాలనుంచి పాఠాల్ని నేర్చుకోవడం ఆయన్నుంచే తెలుసుకున్నాడట.

* మైఖేల్‌ జాక్సన్‌ని రెండు సార్లు కలిసి మాట్లాడాడు. ఫోన్లో కూడా మాట్లాడుకునేవారట. జాక్సన్‌ని ఇబ్బంది పెట్టకూడదనీ ఫొటో అడగలేదని చెప్పే రెహమాన్‌ అది తీరని కోరిక అంటాడు. ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్టు చేయాలని అనుకున్నారట కూడా!

* సూఫీ సంగీతం నేర్చుకున్నాక తన ప్రపంచం మరింత విస్కృతమైందని చెప్పే రెహమాన్‌… తనపైన గజల్స్‌ గాయకుడు నుస్రత్‌ ఫతే అలీఖాన్‌ ప్రభావం ఉందంటాడు.

* సుభాష్‌ ఘాయ్‌ సూచనతో హిందీ పద్యాలూ, దోహాలను చదువుతూ ఆ భాషపైన పట్టు సాధించిన రెహమాన్‌ తర్వాత ఉర్దూ, పంజాబీ నేర్చుకోవడంపైనా దృష్టిపెట్టాడు.

* ఎయిర్‌టెల్‌ వాణిజ్య ప్రకటన కోసం రెహమాన్‌ స్వరపర్చిన ట్యూన్‌… ప్రపంచంలోనే అత్యధికంగా 15 కోట్ల డౌన్‌లోడ్లు నమోదు చేసింది.

* తన స్టేజి షోలూ, ఇతర లైవ్‌షోల వీడియోలు చూడ్డం మొదలుపెట్టాక తన శైలి మార్చుకున్నానంటాడు రెహమాన్‌. ‘అవి ఎంతో బోరింగ్‌గా అనిపించేవి. నేను స్టేజిమీద కదులుతూ ప్రేక్షకులతో ఇంకాస్త కలిసిపోతే బావుంటుందనిపించింది’ అని చెబుతాడు రెహమాన్‌. మహా సిగ్గరి అయిన రెహమాన్‌ ఓ షోలో స్టేజి దిగి ముందు వరుసలో ఉన్న అమ్మాయిని ‘హౌ మచ్‌ డు యూ లైక్‌ మ్యూజిక్‌? డూ యు లవ్‌ మి?’ అని ప్రశ్నలు వేశాడంటే ఎంత మారాడో అర్థం చేసుకోవచ్చు.

* కాన్సర్ట్‌ల కోసం స్టైలింగ్‌ కూడా మెరుగుపర్చుకున్నాడు. 2010 నుంచి భార్య సైరానే రెహమాన్‌కి స్టైలిస్ట్‌గా ఉంటోంది. కాన్సర్ట్‌కి సిద్ధమవుతూ, యువ మ్యుజీషియన్స్‌ నుంచి కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకుంటాడు. ముందు రోజు బాగా నిద్రపోతాడు కూడా, లేదంటే గొంతు సరిగ్గా రాదంటాడు. రెహమాన్‌ సినిమా పాటలూ, లైవ్‌షోలూ, స్టేజి షోలన్నీ కలిసి ‘ఓపెన్‌ హార్ట్‌’ పేరుతో సినిమాగానూ వచ్చింది.

* వర్చువల్‌ రియాలిటీ సినిమా ‘లే మస్క్‌’ తీస్తున్నాడు. భార్యతో కలిసి దీనికి కథ రాసిన రెహమాన్‌, మొదటిసారి దర్శకుడిగా మారాడు.

* ‘బోంబే డ్రీమ్స్‌’ మొదటి అంతర్జాతీయ ఆల్బమ్‌. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌, పీలే, 127 అవర్స్‌… లాంటి 13 హాలీవుడ్‌ సినిమాలకు సంగీతం అందించాడు. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌… రెండు ఆస్కార్లూ, రెండు గ్రామీల్నీ, బాఫ్టా, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్నీ తెచ్చింది. ఒకే ఏడాది రెండు ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి రెహమాన్‌

అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

Feedback on WhatsApp

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి