29, జులై 2017, శనివారం

వెలుగును విస్తరింపజేయండి. చీకటి జాడల్ని ఎంచనవసరం లేదు.



ఒక జాలరి చెరువులో గాలంవేసి చేపల్ని పడుతున్నాడు. అది చూసిన ఒకాయన “ఏం చేస్తున్నావు?” అని అడిగితే, ‘నీటిలో మునిగిపోయిన చేపల్ని ఒడ్డున పడేస్తున్నాను – కరుణతో – అని సమాధానమిచ్చాడు జాలరి. మతమార్పిడి చేస్తున్న పెద్దమనుషులు ఈ జాలరులవంటి వారే” – ఈ మాటలు స్వామీ దయానందసరస్వతీ మహోదయులు వక్కాణించినవి. ఎంత అద్భుతంగా వాస్తవాన్ని వర్ణించారు!
ప్రేమ, సేవ తమ స్వభావాలన్నట్లుగా మాట్లాడుతూ, వంచనతో హిందూ చేపల్ని సనాతన దర్పము చెరువునుండి బయట పడేస్తున్న విదేశీ మతోద్యోగుల వ్యాపారుల వంచనాశిల్పమిది.
వారు దయను అభినయిస్తూ మాట్లాడవచ్చుగాక. కానీ చేపలు మాత్రం – “ఆహా! వీడెంత దయామయుడు! నీటిలో మునిగిపోయిన నా బ్రతుకును ఒడ్డున పెడుతున్నాడు. బయటనున్న విశాల ప్రపంచాన్ని చూపించాడు. చెరువే ప్రపంచమనుకుని ఇన్నాళ్ళూ భ్రమతో ఉన్నాను” అని మురిసిపోతే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. మతం మారిపోతున్న వారంతా అటువంటి మూర్ఖమీనాలేననడం సందేహం లేదు.
గమనిక: ఈ సందర్భంలో వ్రాస్తున్న మాటలన్నీ ఇతరమతాలని ఎత్తిచూపడమో, కించపరచడమో కాదు. అందరినీ గౌరవిస్తూ ఎవరి ధర్మంలో వారు బ్రతకాలి అని చెప్పడమే ఉద్దేశం. అన్ని మతాలపైన సహన, సోదరభావం సహజంగా కలిగిన హిందువుగా ముందే ఒక విన్నపం చేసుకొని విషయాలను స్పష్టం చేసుకుందాం.
ప్రేమలు, సేవలు, రక్షణలు, స్వస్థతలు, సువార్తలు, కూటములు ఇవన్నీ విష కుంభాలపై జల్లిన అమృతపు చినుకుల పొంగులేననీ కాస్త వివేకమున్న వాడెవడైనా ఒపుకుని తీరవలసిందే!
పరాయిదేశాల నుంచీ వచ్చే మతవ్యాపారుల మోచేతి నీటి తీర్థప్రాశన చేస్తున్న పాపాత్ములు, తమ ధనాశను తీర్చుకోవడానికై చేస్తున్న వ్యాపారమిది. ‘ధర్మం’ పేరుతో వ్యాపారాలు చేయడం వారి నైజం!
‘అది మతమూ కాదు, ధర్మమూ కాదు. అది కేవలం వాణిజ్యం(commerce) అని ఏనాడో అనీబిసెంట్ అన్న మాటని విస్మరించరాదు. హింస, విధ్వంసాలు పునాదులుగా విస్మరిస్తూ వ్యాపారంగా, పాలనగా తామే ప్రపంచాన్ని ఏలాలనే విషకాంక్షతో, వ్యూహాత్మకంగా పరిశ్రమలను నడిపేటంత యాజమాన్య శిక్షణలతో మన అవినీతి నాయకుల అండదండలతో పెచ్చరిల్లుతున్న పైశాచిక కాండయే ఈ మతమార్పిడుల మారణోద్యమం! ఇది దాచేస్తే దాగని సత్యం!
ఇలాంటి నేపథ్యంలో ఆ విదేశీమత వాణిజ్యసంస్థలు విసిరే నోట్ల కట్టలకోసం – మానవతా ధర్మానికి విరుద్ధంగా ఒక కులాన్నో ఒక మతాన్నో తరచూ అవమానిస్తూ, లోపభూయిష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్న మీడియా దారుణ కృత్యాలు ఊపందుకుంటున్నాయి.
పనికట్టుకొని హిందూ శ్రద్ధాకేంద్రాలలో లోపాలను ఎత్తిచూపడమో. హిందూ వ్యవస్థలోని ఏ జాతి వివక్షనో లేవదీసి చర్చావేదికలు పెట్టడమో చేసి వినోదిస్తున్నారు. దీనిద్వారా హిందూమతాన్ని సంస్కరించుదామనే మహోద్దేశాలేమీ లేవు. కేవలం తమకు హిందూ ద్వంసకాండ ద్వారా, పరాయి వారి నుండి లభించే దానాల కోసం చేసే ప్రాజెక్ట్ లు మాత్రమే ఇవి.
“హిందూమతం కొన్నాళ్ళకి తగ్గిపోతుంది’ అని కొందరిచే అనిపించి, దానిని ఖండించే అమాయకుల్ని కూర్చోబెట్టి అరిపించి ఒకసారి వినోదిస్తే...’హైందవుల అంతర్మథనం’ అంటూ చర్చ లేవదీసి, హిందువులలో లోపాలవల్లనే మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాటికి సమాధానాలిమ్మని పదిమందిని అడిగి, వారిని సంపూర్ణంగా మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటూ వికృతకేళిని మరోసారి నిర్వహిస్తారు.
ఇవి కొన్ని ‘ఛా’నల్స్ కు ఆనవాయితీ. ఈ కైంకర్యం వలన వారికి మతాంతరీకరణ సంస్థలనుంచి పెద్ద మొత్టాలే ముడతాయి. కానీ వారు చూపిస్తున్న లోపాలు, ఆరోపణలు నిజానికి చెప్పుకోదగ్గవి కావు. లోపమూ, ఆరోపణా లేని మతమూ, సిద్ధాంతమూ, వ్యవస్థా ఏదీ ఈ భూమి మీద లేదు.
హిందువుల్లో కొన్ని ముఖ్య లోపాలున్నాయి. అవి మూడే మూడు. ఇంతకుమించి మరేమీ లేవు అని సవినయంగా మనవి చేసుకుందాం.
ఒకటి: అన్ని మతాలూ ఒకే సత్యం వైపు నడిపించే దారులు...అని తాత్త్వికంగా  మాట్లాడి, అందర్నీ అక్కున చేర్చుకోవడం. ఇదే తాత్త్విక దృష్టి అవతలి వాడికి లేదని తెలుసుకోలేకపోవడం.
రెండవది: దీనిని అలుసుగా తీసుకుని ప్రవేశించి మనల్ని నిందిస్తూ అవతలివారు రెచ్చిపోతుంటే, చూస్తూ సహిస్తూ, ‘నిజమే-మాలో లోపాలున్నాయేమో!’ అని భ్రమించి విస్తుపోవడం.
మూడవది: ఏ మతాన్ని ఎత్తిచూపినా అది మానవతావాదానికి విరుద్ధమనీ, ‘ఒకరి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా మాధ్యమరంగానికి లేదా?’ అని ప్రశ్నించలేకపోతున్నాం.
“నీ చానల్ వీక్షకుల్లో హిందువులు లేరా? వారి మనసు గాయపడదా?’ అని అడగలేని చవటాయితనం పెద్దలోపం. – ఈ మూడు లోపాలు తప్ప మరేమీ లేవు. మిగిలినవి వాళ్ళు చిత్రించి చూపిస్తున్నవే గానీ లోపాలు కావు.
‘ఒక సిద్ధాంతంలోని లోటుపాట్లు చర్చించాలంటే దానిలో ప్రావీణ్యం ఉండాలి. అధ్యయనం ఉండాలి. కనిపిస్తున్న వ్యవహారాలు చాలవు. యుగాలనుండి వర్ధిల్లిన విస్తారమైన హిందూధర్మం వీరికి అర్థమౌతుందా?
చెట్టులో, పుట్టలో, రాతిలో, పసుపుముద్దలో, విగ్రహంలో, యంత్రంలో, మంత్రంలో, యజ్ఞాగ్నిలో, దీపకళికలో, సూర్యచంద్రులలో, నదీజలాలలో, పర్వతాలలో పరమాత్మను భావించి ఆరాధించే ఉదాత్త దర్శనశక్తి వీళ్ళకి అవగాహన అవుతుందా?
ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ప్రార్థించడం దగ్గరనుంచి, అన్ని సుఖాలను త్యాగం చేసి, పరమ వైరాగ్యంతో ఆత్మతత్త్వాన్ని  ఆవిష్కరించుకొని, తరించే తత్త్వజ్ఞాన సంపత్తి కలిగిన ఒకే ఒక ధర్మం – హైందవమేనని వారికి తెలుసా? వ్యాస వాల్మీకి అగస్త్య వసిష్ఠాది మహర్షుల తపఃఫలం, ఆదిశంకర, రామానుజాచార్య, మధ్వాచార్య వంటి మహాతత్త్వవేత్తల దర్శనశక్తి, రామకృష్ణపరమహంస, స్వామీ వివేకానంద, స్వామీ రామతీర్థ, పరమహంస యోగానంద వంటి మహనీయుల జ్ఞానవైభవం, రమణమహర్షి, కావ్యకంఠ గణపతి ముని, స్వామి రామా వంటి మహాయోగుల తత్త్వదీప్తి, వీటి ప్రభావంగా ఎందఱో విదేశీ మేధావులు హిందూ ధర్మ సాధనలను ఆచరించి, జ్ఞానసిద్ధిని పొందిన ఘట్టాలు...వీటి గురించి ఎప్పుడైనా పరిశీలించారా!
రంగులు లేని కళ్ళద్దాలతో, వీరి విజ్ఞానాల్లో కొన్ని పుటలైనా అధ్యయనం చేశారా? కొద్ది వేల ఏళ్ళ చరిత్ర, ఒక్క పుస్తకం, ఒక్క ప్రవక్త బోధ మాత్రమే కలిగిన పరిమిత జ్ఞానాన్ని పట్టుకొని, హింస, విధ్వంసాలతో ఎన్నో దేశాల నాగరికతలను నాశనం చేసి, ఆక్రమించుకున్న అల్పకాల మతాలను వెనకేసుకు వచ్చి అనాది యుగాల నాటి దేశీయ దివ్య విజ్ఞానాన్ని విచక్షణారహితంగా ఎద్దేవా చేయడానికి, ఒక్క మీడియా ఉందన్న అహంకారం అర్హతగా సరిపోతుందా?
ఇతరమతగ్రంథాలు, ప్రవక్తలు తక్కువ వారు అనే పాపానికి మేము ఒడిగట్టడం కాదు కానీ ఒక్క సత్యం మాత్రం విస్మరించవద్దు అని వినతి చేసుకుంటున్నాం. ఏ ప్రవక్తలకో తీసిపోని, ఇంకా మాట్లాడితే మించిపోయిన యోగులు, మహర్షులు, మహాత్ములు, సిద్ధపురుషులు, మునులు, తపస్వులు, జ్ఞానులు వేల సంఖ్యలో కలిగిన ఒక మహాసుధాసముద్రం సనాతన ధర్మం. దీనిలో ఒక కెరటం పాటి ఉండవు ఇతర ధర్మాలు. ఆ మిడిసిపాటుతనంతో ఆక్రమణలు చేసుకున్న మతాలకు అంతర్మథనాలు, ఆత్మ పరిశీలనలు అవసరం!
అలాంటి అంతర్మథన కార్యక్రమాలను మీడియాలకి పెట్టగలిగే దమ్ముందా?
చరిత్రలో ఇప్పటికి ఎన్ని దేశాల్లో మతవిస్తరణ కోసం మాన, ప్రాణభంగాలు చేశారు? ఎన్ని అద్భుతమైన నిర్మాణాలు ధ్వంసం చేశారు? చేస్తున్నారు? మీ మతదేశాల్లో ఇతరులకి స్వేచ్ఛా వాయువులున్నాయా?
మీరు ధ్వంసం చేసిన ఆలయాలను మళ్ళీ పునర్నిర్మించగలరా? ఉగ్రవాదమో, తీవ్రవాదమో, వేర్పాటువాదమో, కరడుగట్టిన మతఛాందసమో తప్ప ఒక్క యోగ విజ్ఞానాన్నీ గానీ, తత్త్వజ్ఞానాన్ని గానీ, త్యాగశీలురను గానీ, ఉదారవాదులను గానీ మీ సిద్ధాంతం ఎందుకు తయారుచేయలేదు? ఉగ్రవాద శిక్షణలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? డబ్బులకోసం మతం మారడం తగునా? మీ మతంలో ఏమి అధ్యయ్యనం చేసి మారుతున్నారు? అని ప్రశ్నించగలరా?
అన్యమతస్థులకు సమానావకాశాలు కల్పించి, ఉన్నత పదవులను పాలనాధికారాలను, గౌరవాలను, ప్రశంసలను అందించగల ఒకే ఒక్క ధన్య దేశం భారతమేనని సగర్వంగా చాటవలసిన ఉన్నత స్థితిలో ఉన్న మనకు ఆత్మన్యూనతను కల్పించడం తగునా?
ఒక దుర్మార్గుడు ఒక అమాయకుడిని చితకబాడి దోచుకున్నాడు. ఇతగాడు రోదిస్తూ ఉంటే వచ్చి “నీలో బలహీనత వల్లే వాడు కొట్టాడు. ణీ లోపాలు తెలుసుకో దిద్దుకో” అని ఉపన్యాసమిచ్చినట్లు, మన లోపాలు ఏమిటో వెతుకుతున్నారు. ద్రోహబుద్ధితో వంచనతో తిరుగుతున్న దుర్మార్గాన్ని సమర్థిస్తున్నారు. మీ అంతరాత్మను సూటిగా ప్రశ్నించండి.
మీరిప్పుడు హిందూమతంపై ప్రశ్నలు కొత్తవేమీ కావు. వీటన్నిటికీ మాడు పగిలేలా సూటి సమాధానాలు వందల ఏళ్ళనుండి వివేకానంద వంటి మహాత్ములు ఇస్తూనే ఉన్నారు.
ధర్మంలో పూర్ణత ఉన్నా, వ్యక్తుల స్వార్థాల వల్ల, ఇతరుల దాడుల వల్ల, అన్యం పట్ల వ్యామోహం వల్ల రాజకీయ దుర్మార్గం వల్ల ఏర్పడ్డ ఛిద్రాలను అవకాశాలుగా తీసుకుని ధర్మనింద చేయడం తగునా?
అగ్రవర్ణాలకు చెందని ఎందఱో యోగులు, జ్ఞానులు, అవధూతలు ఈ దేశంలో ఏనాటినుండో గౌరవింపబడుతున్నారు. హిందువు ఎప్పుడూ గర్వించదగ్గ స్థాయిలోనే ఉన్నాడు. విదేశీమతపెద్దల పెట్టుబడులతో, వారిచేత పెట్టబడిన బుర్రలున్న పాలకులతో అలరారుతున్న మాధ్యమరంగం దృష్టిలో హిందూత్వం వెలవెలపోతోంది. కానీ వాస్తవ దృష్టితో చూస్తే హిందూ వైభవం జగద్వ్యాప్తమౌతోంది.
ఎందఱో బడుగువర్గాల వారు దీక్షగా అయ్యప్పను సేవిస్తున్నారు. భవానీ మాలలను ధరిస్తున్నారు. ఆపదమొక్కుల వానికి అడుగడుగు దండాలు పెడుతున్నారు. వారిని ఆ ఆలయాలు ఆహ్వానిస్తున్నాయి. ఉత్తరాది క్షేత్రాల్లో కూడా జ్యోతిర్లింగాలు అతిసామాన్యుని చేత అభిషేకించుకుంటున్నాయి. తొక్కిసలాటలతో, బారులతో తిరునాళ్ళు, కుంభమేళాలు, పుష్కరాలు జరుగుతున్నాయి. మేధావులారా! ఒక్క విచక్షణని సాధించే ప్రయత్నం చేయండి.
సృష్టిలో అన్ని ధర్మాలకు వేటి స్వభావం వాటికుంటుంది. వైద్యవిధానాల్లో వంద రకాలున్నాయి. మతాలూ అలాగే ఉంటాయి, ఉండాలి. ఆయుర్వేదంలో అనుపానానికీ, పథ్యానికీ ప్రాధాన్యం. ఆధునిక వైద్యంలో వాటి అవసరం లేదు. అంతేగానీ పథ్యానుపానాలు లేని ఆధునికమే మంచిదని గానీ, అవి కలిగిన ఆయుర్వేదమే శ్రేష్ఠమని గానీ సిద్ధాంతం చేయడానికి వీలులేదు. సాఫల్య వైఫల్యాలు రెండింటిలోనూ ఉంటాయి. అవి వైద్య శాస్త్రం లోపాలు అనలేము. వైద్యుల పొరపాటో, రోగుల గ్రహపాటో అని సర్డుకుపోతున్నాం. అవే మతాలకు వర్తిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే. ఏ విద్యావిధానాన్ని అనుసరించే రోగి దాని పధ్ధతిలోనే చికిత్స పొందాలి. అంతే.
వీలయితే అధ్యయనం చేయండి. మంచిని బోధించండి. అందరినీ కలసిమెలసి ఆనందంగా బ్రతకనివ్వండి. కించపరచడాలు, ఎత్తిచూపడాలతో మీరు సాధించేదేమిటి?  హిందూ మత నిర్మూలనమా? అది మీవల్ల కాదు.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించుకుంటూ, సంస్కరించుకుంటూ ఎదుగుతున్న ‘డైనమిజం’ హైందవంలో ఉంది.
చివరిగా ఒక మాట- వాస్తవాలను చర్చించడమే ఇందులో ఉద్దేశం. ఒక ఆర్తినీ, సత్యఘోషనీ వెలువరించడమే ఆంతర్యం. అంతేగానీ ఏ ధర్మాన్నీ కించపరచే భావం ఈషణ్మాత్రం కూడా లేదని సవినయంగా మనవి. యుగాల క్రితమే, సృష్టిస్థితిలయకారకమైన మహా చైతన్యం గురించి అన్నిరకాల భావనలను ఆవిష్కరించి, ఎవరి సంస్కారానికి తగినట్లుగా వారు తరించడానికి రాచమార్గాలు వేసిన విశాల సనాతన ధర్మానికి చెందినా ఏ ఒక్కరూ అన్ని మతమార్గాలను గౌరవించే విజ్ఞతతోనే ఉంటారు. సమాజంలోని లోపాలను, వ్యక్తుల అవినీతినీ ధర్మానికి అంటగట్టవద్దు.
క్షుద్రప్రయోజనాల కోసం కాకుండా సామరస్య జీవన సరళితో కూడిన సమాజ నిర్మాణానికి శక్తిమంతమైన మాధ్యమరంగం కృషి చేయాలి. అన్నిటిలోని మంచిని మాత్రమే వ్యాప్తి చేస్తే, చెడు దానంతటదే తొలగిపోతుంది. వెలుగును విస్తరింపజేయండి. చీకటి జాడల్ని ఎంచనవసరం లేదు.
ముస్లిం, క్రైస్తవ సోదరులు కూడా ఈ దిశగా సామరస్య భావనను అవలంబించలి --   సామవేదం షణ్ముఖ శర్మ  గారి ప్రవచనం నుండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి