30, నవంబర్ 2020, సోమవారం

వాణీ జయరాం

ఆమె గానం... సుమధురం

70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్‌ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో ‘బోల్‌ రే పపీ హరా.. పపి హరా’ అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అది ‘గుడ్డి’ సినిమాలో ఆమె పాడిన మొదటిపాట. అలా మొదటి పాటతోనే హిందీ చిత్రసీమలో వాణిజయరాం పేరు మారుమోగి పోయింది. సంప్రదాయ కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతురాలైన వాణిజయరాం పాటలు విలక్షణంగా ఉండేవి. క్రమంగా నౌషాద్, మదన్‌ మోహన్, జయదేవ్, చిత్రగుప్త, ఓ.పి. నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కల్యాణ్‌ జీ ఆనంద్‌ జీ, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి సంగీత దర్శకులు వాణిజయరాంకి మంచి అవకాశాలు ఇవ్వటం మొదలైంది. చలనచిత్రరంగం ఆమెను ‘భారతీయ నైటింగేల్‌’ అని పిలవసాగింది. అప్పటికే వేళ్లూనుకొని వున్న కొందరికి ఆమె ఎదుగుదల రుచించలేదు. సహజంగానే రాజకీయం నడిపారు. సున్నిత మనస్కురాలైన వాణిజయరాంకి మనస్తాపం కలిగింది. వెంటనే మద్రాసుకి మకాం మార్చింది. అలా తెలుగు సినిమాల్లో ఆమె పాడిన పాటలు వినే భాగ్యానికి శ్రోతలు నోచుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమాలే ఆమెకు రెండు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు తెచ్చిపెట్టాయి. నవంబరు 30న వాణి జయరాం  పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు....

సంగీత నేపథ్యం...

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణిజయరాం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కచెల్లెళ్ల సంతతిలో వాణిజయరాం ఐదవ సంతానం. తల్లి పద్మావతి ప్రముఖ వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగార్‌ శిష్యురాలు. కుటుంబ సభ్యులందరికీ సంగీతమంటే ప్రాణం. తన అక్క కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్‌ వద్ద సంగీత శిక్షణ పొందుతూ వుంటే వాణి కూడా ఆమెతోబాటు కీర్తనలు పాడుతుండేది. కుటుంబం మద్రాసుకు మకాం మార్చిన తరువాత కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్‌.బాలసుబ్రమణియన్, ఆర్‌.ఎస్‌.మణిల శిష్యరికంలో కఠినమైన కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టింది. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు వాణి బాగా పాడేది. తన ఎనిమిదవ ఏటనే వాణిజయరాం సంగీత కచేరి నిర్వహించింది. చిన్నతనం నుంచీ హిందీ పాటలు రేడియో సిలోన్‌లో వినటం వాణికి అలవాటు. నేపధ్యగాయనిగా ప్రయత్నం చేస్తానంటే తల్లి ఒప్పుకోలేదు. పెళ్లయ్యేదాకా ఆ ప్రయత్నం మానుకోమంది. మద్రాస్‌ క్వీన్స్‌ మేరీ కాలేజిలో పట్టా పుచ్చుకున్న తరువాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తొలుత మద్రాసు, తరువాత హైదరాబాదులో ఉద్యోగం చేసింది. 1960లో జయరాంతో వివాహానంతరం వాణి మకాం బొంబాయికి మారింది. వ్యాపార ప్రకటనలకు ‘జింగిల్స్‌’ పాడుతూ వాణిజయరాం బిజీగా ఉంటూనే ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ వద్ద హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో శిక్షణ పొందింది. ఈ శిక్షణ ఎంత కఠినమైందంటే రోజుకి 18 గంటలు ‘తుమ్రి భజన్‌’లో మెళకువలు ‘గజల్‌’ ప్రక్రియలో సాంకేతికత నేర్చుకొవటానికే సరిపోయేది. ఈ శిక్షణా కాలంలోనే వాణిజయరాం తన మొట్టమొదటి హిందుస్తానీ క్లాసికల్‌ కచేరిని మార్చి 1, 1969న బొంబాయిలో ఏర్పాటుచేసి సభికుల్ని అలరించి విద్వాంసుల్ని ఆకట్టుకుంది. అప్పుడే ప్రముఖ సంగీత దర్శకుడు వసంత దేశాయిని కలవటం తటస్థించింది. వినూత్నమైన ఆమె కంఠస్వరానికి ముగ్దుడైన వసంత దేశాయి వాణిజయరాంతో తొలుత కుమారగంధర్వతో ఒక మరాఠీ యుగళగీతాన్ని పాడించారు. ఆ వెంటనే హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘గుడ్డి’ (1971) సినిమాలో మూడు పాటలు పాడించారు. వసంతదేశాయ్‌ మేఘమల్హర్‌ రాగంలో స్వరపరచిన ‘బోల్‌ రే పపీ హరా, పపి హరా’ను తన తొలి హిందీ పాటగా వాణిజయరాం 22 డిసెంబరు 1970న పాడింది. ఆ పాటకు ఐదు అవార్డులే కాక, ప్రతిష్టాత్మక ‘తాన్సేన్‌ సమ్మాన్‌’ అవార్డు కూడా వచ్చింది. తరువాత వాణి ఎన్నో మరాఠీ పాటలు పాడింది. పండిట్‌ కుమార గంధర్వతో కలిసి యుగళగీతాలు పాడింది. వసంత దేశాయితో మహారాష్ట్ర మొత్తం పర్యటించి గొప్ప మరాఠీ పాటల రుచులను ప్రజలకు చేరువ చేసింది. పాఠశాల విద్యార్ధులకు మరాఠీ సంగీతంలో శిక్షణ ఇచ్చింది. నిద్రలేవగానే ఆమె నమస్కరించేది దేవుడి పటంతోబాటు మొదటి గురువు వసంత దేశాయి ఫోటోకే. అంతేకాదు అతని ఫోటోకి నిత్యం పూజ కూడా చేస్తుంది. ‘గుడ్డి’ విజయంతో వాణిజయరాం ముఖ్య సంగీత దర్శకులకే కాకుండా మరాఠీ, గుజరాతి, మార్వాడి, భోజపురి భాషా చిత్రాలకూ పాటలు పాడింది. రఫీ, మన్నాడే, మహేంద్ర కపూర్, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ల సరసన ఎన్నో యుగళ గీతాలకు ప్రాణం పోసింది. నౌషాద్, చిత్రగుప్త, మదన్‌ మోహన్, ఓ.పి.నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కళ్యాన్‌ జి ఆనంద్‌ జి, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి హేమాహేమీలైన సంగీత దర్శకుల చిత్రాలకు అనేక హిందీ పాటలు ఆలపించింది. తరువాత ఆమె మకాం మద్రాసుకు మార్చింది.

దక్షిణ భారత గాన సరస్వతిగా..

వాణిజయరాం మద్రాసుకు తరలి రావటం దక్షిణ భారత చిత్రసీమకు మేలే జరిగింది. మాతృభాష కాకపోయినా పాడిన అన్ని భాషల్లో మాటల స్వచ్చతతోబాటు నేటివిటీని జోడించి పాడటంచేత ఆమె కంఠాన్ని తమ స్వంత ఆడపడుచు స్వరంగానే అందరూ భావించి ఆదరించారు. మద్రాసు వచ్చిన కొత్తలో వాణిజయరాం చేత ఎస్‌.ఎం.సుబ్బయ్య నాయుడు ‘తాయ్యుం సెయ్యుం’ అనే చిత్రానికి పాడించారు. అనివార్యకారణాల వలన ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తరువాత శంకర్‌-గణేష్‌ ‘వీట్టుక్కు వందా మరుమగü్’ (1973) చిత్రంలో సౌందర్‌ రాజన్‌తో కలిసి ‘ఓరిడం వున్నిడం’ అనే యుగళ గీతాన్ని పాడించటంతో తమిళంలో వాణిజయరాం బిజీ అయ్యారు. తరువాత శంకర్‌-గణేష్‌ సంగీత దర్శకత్వంలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎం.ఎస్‌.విశ్వనాథన్‌-బాలచందర్‌ జంట కలిసి పనిచేసిన అనేక తమిళ సినిమాలకు వాణిజయరాం అద్భుతమైన పాటలు పాడారు. వారి సంగీతసాంగత్యం చాలాకాలం కొనసాగింది. ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమాతో వాణిజయరాం చాలా బిజీ అయ్యారు. కున్నక్కుడి వైద్యనాదన్, వి.కుమార్, జి.కె. వెంకటేష్, విజ్కాయ భాస్కర్, కె.వి.మహదేవన్‌ సంగీత సారధ్యంలో వాణిజయరాం ఎన్నో తమిళ, కన్నడ పాటలు పాడారు. 1973లో ‘స్వప్నం’ అనే మళయాళ చిత్రానికి సలీల్‌ చౌదరి సంగీత దర్శకత్వంలో ‘సౌరయుద్ధత్తిల్‌ విదర్నూరు’ అనే పాట పాడారు. ఆ పాట మలయాళంలో మంచి హిట్టయింది. మళయాళ సంగీతదర్శకులు ఎం.కె. అర్జునన్, దేవరాజన్, ఆర్‌.కె. శేఖర్, దక్షిణామూర్తి, బాబురాజ్, శ్యామ్, రవీంద్రన్, కన్నూర్‌ రాజన్, జెర్రీ అమలదేవ్‌ పనిచేసిన సినిమాలకు వాణిజయరాం కొన్ని వేలపాటలు పాడారు. అలాగే కన్నడ చిత్రసీమలో ఎల్‌.వైద్యనాదన్, టి.జి.లింగప్ప, ఉపేంద్ర కుమార్, హంసలేఖ సంగీత దర్శకత్వం నెరపిన వందలాది సినిమాలలో తన గళం వినిపించారు. తెలుగులో కోదండపాణి వాణిజయరాంతో ‘అభిమానవంతులు’ (1974) సినిమాకి ‘ఎప్పటివలె కాదురా నా స్వామీ’ అనే ఒక జావళి పాడించారు. ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు తొలిసారి సినిమాలో ఈ పాటకు నర్తించటం విశేషం. ఇక్కడో విషయం గుర్తు చెయ్యాలి. ప్రముఖ దర్శక నిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే’(1955)లో హీరోయిన్‌ సంధ్యకి ‘జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే’ అనే మీరా భజన్‌ని సంగీత దర్శకుడు వసంత దేశాయి లతా మంగేష్కర్‌ చేత పాడించారు. ఈ పాటకి పద్మవిభూషణ్‌ శివకుమార్‌ శర్మ సంతూర్‌ వాద్యం వినిపించారు. హిందీ పాటల్లో సంతూర్‌ పరికరాన్ని వాడటం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ పాట బహుజనాదరణ పొందింది. 1979లో గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ సినిమాలో పాటలన్నీ సంగీత దర్శకుడు పండిట్‌ రవిశంకర్‌ వాణిజయరాంతో పాడించారు. ముఖ్యంగా ‘జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే’ భజన్‌ ఆమె గళంలో అద్భుతంగా అమరింది. పైగా సంతూర్‌ వాయిద్యానికి బదులు రవిశంకర్‌ సితార్‌ వాయిద్యాన్ని స్వయంగా వాయించటంతో పూవుకు తావి అబ్బినట్లయింది. ఈ పాటకు వాణిజయరాం ‘ఫిలిం వరల్డ్‌ సినీ హెరాల్డ్‌’ బహుమతి అందుకుంది. అందరూ లతా పాటని, వాణిజయరాం పాటని పోల్చి చూసి, వాణి పాడిన పాటే బాగుందని తేల్చారు. ఇదే పాటని యష్‌ చోప్రా నిర్మించిన ‘సిల్‌ సిలా’(1981) చిత్రంలో సంగీత దర్శకులు శివ్‌-హరి మళ్లీ లతా చేత పాడించారు. అక్కడ కూడా లతా పాటకన్నా వాణిజయరాం ఆలపించిన భజనే గొప్పగా వుందని తేలింది.
                                   
‘మీరా’ చిత్రం విడుదలైన తరువాత నుంచి వాణిజయరాంను ‘మీరా ఆఫ్‌ మోడరన్‌ ఇండియా’గా అభివర్ణించడం మొదలైంది. ఈ పాటకు వాణిజయరాం ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్‌ బహుమతి కూడా అందుకుంది. లతాజీకి వాణిజయరాం మీద అసూయ పెరిగేందుకు ఇవన్నీ కారణాలయ్యాయి. ఈ రాజకీయాన్ని భరించలేని వాణిజయరాం హిందీ చిత్రసీమకు దూరంగా జరిగింది. అయితే, ఎం.ఎస్‌. విశ్వనాథన్, మహదేవన్, రాజన్‌-నాగేంద్ర, విజయ భాస్కర్, చక్రవర్తి, సత్యం, శంకర్‌-గణేష్, చంద్రబోస్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణిజయరాం ప్రతిభను చక్కగా వినియోగించుకొని, ఆమె గళం ద్వారా తమ పాటలకి వన్నె తెచ్చారు. తమిళంలో ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ స్వరం కూర్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ (తెలుగులో తూర్పు-పడమర) చిత్రంలో ‘ఏళు స్వరంగళుక్కుళ్‌’ పాటకు 1976లో జాతీయ స్థాయిలో ఆమె ఉత్తమ గాయని ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తరువాత ఆ అదృష్టం తెలుగు చిత్రాలకే దక్కింది. ‘శంకరాభరణం’ (1980)లో ఆలపించిన ‘బ్రోచేవారెవరురా’, ‘మానస సంచరరే’, ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే మూడు పాటలకు సంయుక్తంగా; ‘స్వాతికిరణం’(1991) చిత్రంలో ‘ఆనతినీయరా హరా’ అనే పాటకు వాణిజయరాంకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డులు దక్కాయి. ఇవి కాక గుజరాత్‌ (ఘూంఘట్‌), తమిళనాడు (అళఘే ఉన్నై ఆరాధిక్కిరేన్‌), ఆంధ్రప్రదేశ్‌ (శంకరాభరణం), ఒడిషా (దేబ్జని) రాష్ట్రాల పురస్కారాలు కోకొల్లలుగా అందాయి. ‘2015లో ఆమె ఫిలింఫేర్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని, పి.బి. శ్రీనివాస్‌ అవార్డుని అందుకున్నారు. 1992లో ‘సంగీతపీఠ’ సన్మానాన్ని అందుకున్న అతి పిన్నవయస్కురాలు వాణిజయరాం కావడం విశేషం. తమిళనాడు ప్రభుత్వం వాణిజయరాంకు ‘కలైమామణి’ పురస్కారాన్ని, త్యాగరాజర్‌ భాగవతార్‌ పేరిట ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని, సుబ్రమణ్య భారతి అవార్డును, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అవార్డులను ప్రదానం చేసింది. చెన్నైలోని ముద్ర అకాడమీ వారు దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ సంగీతాన్ని అందించినందుకు వాణిజయరాంకు ‘ముద్ర అవార్డు’ బహూకరించారు. ఇంకా ఎన్నెన్నో బహుమతులు వాణిజయరాంకు దక్కాయి. ఘంటసాల జాతీయ బహుమతి, దక్షిణ భారత మీరా బహుమతి వాణిజయరాం అందుకున్నారు.

భక్తి పాటల జగధాత్రి...

భక్తి పాటలు పాడటంలో పదిహేనేళ్లుగా వాణిజయరాం మహారాజ్ఞిగా వెలుగొందుతున్నారు. రఘునాథ పాణిగ్రాహి తరువాత జయదేవుని అష్టపదులకు వూపిరినిచ్చిన గాయని వాణిజయరాం. ఆమె దాదాపు 18 భాషల్లో భక్తి గీతాలు ఆలపించారు. సంగీతోత్సవాల్లో వాణిజయరాం పాల్గొని ప్రదర్శనలిచ్చేది. ‘బద్రి కేదార్‌ ఫెస్టివల్‌’, ‘గంగా మహోత్సవ్‌’, ‘వారణాసి ఉత్సవ్‌’, ‘స్వామి హరిదాస్‌ ఫెస్టివల్‌’ వంటి భక్తి ప్రధాన ఉత్సవాల్లో వాణిజయరాంకి ప్రధమ తాంబూలం దక్కేది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాణిజయరాం పాల్గొనని కచేరీలే లేవు. తులసీదాసు, భక్త కబీర్, మీరా, పురందరదాసు, అన్నమయ్య, త్యాగరాజు సంకీర్తనలను సంగీతరూపంలో ముద్రించి భద్రపరిచారు. బ్రిజు మహారాజ్‌తో కలిసి ‘టుమ్రి’ భజనగీతాలు ఆలపించారు. ప్రఫుల్లకర్‌ సంగీత సారధ్యంలో ఒడిస్సీ గురుకులచరణ్‌ మహాపాత్రతో కలిసి ‘గీతగోవిందం’ ఆల్బం కోసం వాణిజయరాం పాడారు. కుమార గంధర్వతో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రుణానుబంధచ్య’ అనే మరాఠీ శాస్త్రీయ యుగళాన్ని ఆలపించారు. ఈ పాటకు వాణిజయరాం గురువు వసంతదేశాయ్‌ సంగీతం సమకూర్చారు. ఆమె సొంతంగా స్వరపరచిన ‘మురుగన్‌’ భక్తి గీతాలను ఆల్బంగా విడుదలచేశారు. ‘సినిమా పాటలకి, భక్తి పాటలకి చాలా వ్యత్యాసం ఉంటుందని; భక్తి పాటలకు శ్రుతిని, రాగాన్ని, లయని సవరించుకొని పాడే సౌలభ్యత వుందని, అదే సినిమా పాటలైతే సంగీత దర్శకుడు బాణీ కట్టిన స్థాయిలోనే, ఆర్కెస్ట్రా ప్రాక్టీసు చేసిన స్థాయిలోనే పాడాల్సి ఉంటుందని వాణిజయరాం చెబుతుంటారు. భక్తి పాటలకు ఉచ్చారణ, సందర్భం, నేటివిటీ, రాగ ఛాయలు చాలా ముఖ్యమని, సంస్కృత పదాలను శబ్దాలంకార పూర్వకంగా వుచ్చరించాల్సి ఉంటుందని వాణి అభిప్రాయం. తనకి స్థానిక భాష రాకున్నా, పదోచ్చారణ, భావం అడిగి తెలుసుకొని ప్రాక్టీసు చేసి పాడుతారు. సింగర్‌కి క్లాసికల్‌ బేస్‌ వుంటే రాగ లక్షణాలు అర్థమౌతాయి కనుక మంచి అవుట్‌ పుట్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని వాణిజయరాం అంటారు. ఇప్పుడు వాణిజయరాం ఎక్కువగా భక్తి గీతాల ఆల్బం రికార్డింగు మీద, శాస్త్రీయ సంగీత కచేరీలు చెయ్యటం పై దృష్టి సారించారు.

తెలుగుదనం నిండిన గళం...

తెలుగులో వాణిజయరాంకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు లెక్క కట్టలేం. ‘స్వప్నం’, ‘అంతులేని కథ’, ‘మరోచరిత్ర’, ‘ఘర్షణ’, ‘మల్లెపూవు’, ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘ సీతాకోక చిలక’, ‘పూజ’, ‘శ్రుతిలయలు’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. ఆమె ప్రముఖ కథక్‌ మేస్ట్రో పండిట్‌ బిర్జు మహారాజ్‌తో అనేక ఆల్బమ్‌లు చేశారు. పది వేలకు పైగా పాటలు పాడిన వాణిజయరాంకి ‘పద్మ’ పురస్కారం ఇవ్వకపోవటం, పుంభావ సరస్వతిని అవమానించినట్లే భావించాలి. వాణిజయరాం భర్త జయరాం మంచి సితార్‌ వాద్యకారుడు. వీరికి సంతానం లేదు. అందుకే తాము ఆర్జించిన సొమ్మును ఎన్నో సంఘసేవా కార్యక్రమాలకు, అనాధ పిల్ల సంరక్షణకు, చదువులకు వినియోగిస్తుంటారు. వాణిజయరాం చాలా సాధారణంగా వుంటారు. సౌమ్యశీలి. ఇంటి పనుల కోసం ఎవరి మీద ఆధారపడరు. వంటపనులు, ఇంటి పనులు స్వయంగా చక్కదిద్దుకుంటారు. అనారోగ్యంతో వాణి భర్త జయరాం ఇటీవలే కాలం చేశారు. వాణిజయరాం మంచి కవయిత్రి, పెయింటర్‌ కూడా. వాణిజయరాం నిండు నూరేళ్లు జీవించి ఆజన్మాంతం కళాసేవలో తరించాలని ఆశిద్దాం.

వాణిజయరాం అలరించిన కొన్ని తెలుగు పాటలు...

* ఆలోకయే శ్రీ బాల కృష్ణం (తరంగం) ... శ్రుతిలయలు
* అలలు కలలు ఎగసి ఎగసి ... సీతాకోకచిలక
* ఆనతినీయరా హరా ... స్వాతికిరణం
* అందెలరవమిది పదములదా ... స్వర్ణకమలం
* బ్రోచేవారేవరురా (మైసూర్‌ వాసుదేవాచారియర్‌ కృతి)... శంకరాభరణం
* దొరకునా ఇటువంటి సేవ ... శంకరాభరణం
* ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ... పూజ
* ఇన్నిరాసుల యునికి ... శ్రుతిలయలు
* జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా... స్వాతికిరణం
* కురిసేను విరిజల్లులే... ఘర్షణ
* మానస సంచరరే ... శంకరాభరణం
* మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా ... సీతాకోకచిలక
* నింగి నేల ఒకటాయెలే ... పూజ
* నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా .. వయసు పిలిచింది
* నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా ... మల్లెపూవు
* నేనా పాడనా పాటా ... గుప్పెడు మనసు
* ఒక బృందావనం ... ఘర్షణ
* పూజలు చేయ పూలు తెచ్చాను ... పూజ
* ప్రణతి ప్రణతి ప్రణతి ... స్వాతికిరణం
* సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే ... సీతాకోక చిలక
* శ్రీ సూర్యనారాయణా మేలుకో ... మంగమ్మగారి మనవడు
* శ్రుతినీవు గతి నీవు ... స్వాతికిరణం
* తెలుమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ... స్వాతికిరణం
* ఏ పాట నే పాడనూ ... సీతామాలక్ష్మి విధిచేయు వింతలన్నీ ... మరోచరిత్ర

- ఆచారం షణ్ముఖాచారి

5, నవంబర్ 2020, గురువారం

AR Rahman melodies


ఏ.ఆర్‌. రెహమాన్‌ అనగానే ‘చిన్ని చిన్ని ఆశ…’ నుంచీ ‘చిట్టి చిట్టి రోబో’ వరకూ ఎన్నో పాటలు మనసుకు స్ఫురిస్తాయి. ఆ పాటల్లో భారతీయత వినిపిస్తుంది. పాశ్చాత్యం వీనుల విందు చేస్తుంది. రెండూ కలగలిసి ఓ నవ్యత ఆవిష్కృతమవుతుంది. రెహమాన్‌ పాటకు ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా అతడి బృందం వివిధ నగరాల్లో స్టేజీషోలలో పాటల్ని ఆలపించనుంది. అందులో తొలి అడుగు (నవంబరు 26న) హైదరాబాద్‌లో వేస్తున్న వేళ రెహమాన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు…

రెహమాన్‌ తండ్రి ఆర్‌.కె.శేఖర్‌, తల్లి కస్తూరి. శేఖర్‌ సంగీత దర్శకుడు. శేఖర్‌ తండ్రి ఆలయాల్లో భజనలు చేసేవారు. నాలుగేళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు రెహమాన్‌. తండ్రి ట్యూన్‌ని అనుకరించడమే కాకుండా, దాన్ని తనకు నచ్చినట్టు మార్చేవాడు కూడా.

* రెహమాన్‌ తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లోని వాద్య పరికరాలను అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. ‘ఆ పరికరాలను అమ్మేయొచ్చుగా’ అని ఎవరైనా సలహా ఇస్తే, ‘మా అబ్బాయి ఉన్నాడుగా’ అని చెప్పేదట. 11 ఏళ్ల నుంచే వేరువేరు సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు రెహమాన్‌. 14 ఏళ్లపుడు దూర్‌దర్శన్‌ ‘వండర్‌ బెలూన్‌’ కార్యక్రమంలో నాలుగు కీబోర్డులు ఒకేసారి ప్లేచేస్తూ కనిపించాడు.

* పనిలోపడి రోజూ స్కూల్‌కి వెళ్లలేకపోయేవాడు రెహమాన్‌. దాంతో స్కూల్లో టీచర్లు కోప్పడేవారట. సంగీత దర్శకులంతా సొంత పరికరాలు కొనుక్కోవడంతో కొన్నాళ్లకు వీరి అద్దె పరికరాలకు డిమాండ్‌ తగ్గింది. ఆ సమయంలో ప్లస్‌వన్‌లో ఉన్న రెహమాన్‌ని చదువు మాన్పించి సంగీతంమీదే దృష్టి పెట్టమని చెప్పిందట తల్లి. ఆ విషయంలో రెహమాన్‌కి మొదట్లో అసంతృప్తి ఉండేది. కొంత డబ్బు సంపాదించి మళ్లీ చదువుకోవాలనుకునేవాడు. కాలేజీ చదువులేని లోటు తనను జీవిత పాఠాలు నేర్చుకునేలా చేసిందంటాడు రెహమాన్‌.

* సంగీత దర్శకుడు రమేష్‌ నాయుడు దగ్గర సెకండ్‌ కీబోర్డు ప్లేయర్‌గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో సొంత వాద్య పరికరాల్ని కొన్నాడు. అవే అతడి భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇళయరాజా, రాజ్‌-కోటి మొదలైన వారి బృందాల్లోనూ కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశాడు.

రెహమాన్‌ అయ్యాడిలా

రెహమాన్‌ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఒకప్పుడు వాళ్లింట్లో హిందూ దేవుళ్ల చిత్రాలతోపాటు, మేరీమాత, మక్కా మదీనా చిత్రాలూ ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత స్వాంతన కోసం ఆలయాలూ, చర్చిలూ, దర్గాలకు తిరగడం ఎక్కువైంది. నెల్లూరు దగ్గరి తడ ప్రాంతంలో ఉండే సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం సూఫీ వైపు మళ్లింది.

* దిలీప్‌ కుమార్‌ పేరు రెహమాన్‌కి నచ్చేది కాదట. తనలోని వ్యక్తికీ, దిలీప్‌ అనే పేరుకీ పోలికలేదనుకునేవాడు. సూఫీ విధానంలోకి మారకముందే రెహమాన్‌ చెల్లి పెళ్లి విషయమై ఓ జ్యోతిష్కుణ్ని కలవడానికి తల్లితోపాటు వెళ్లినపుడు పేరు మార్చుకోవాలనుకుంటున్నట్టు జ్యోతిష్కుడికి చెబితే, రెహమాన్‌ వైపు చూసి… ‘భలే వింతగా ఉన్నావయ్యా నువ్వు’ అంటూ… ‘అబ్దుల్‌ రెహమాన్‌, అబ్దుల్‌ రహీమ్‌… ఈ రెంటిలో ఏ పేరైనా నీకంతా మంచి జరుగుతుంది’ అన్నాడట. దిలీప్‌కు రెహమాన్‌ పేరు బాగా నచ్చింది. అలా ఓ హిందూ జ్యోతిష్కుడు అతడికి ముస్లిం పేరు పెట్టాడు. ఆ పేరు ముందు అల్లారఖా అని పెడితే బావుంటుందని అతడి తల్లికి అనిపించింది. అలా 23 ఏళ్ల వయసులో దిలీప్‌ కుమార్‌ కాస్తా ‘అల్లా రఖా రెహమాన్‌’ అయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు కస్తూరి తన పేరును కరీమా బేగంగా మార్చుకుంది.

* 1990లో రెహమాన్‌కు ‘మల్టీ ట్రాక్‌ రికార్డర్‌’ కొనడం కోసం, కూతురి పెళ్లికని దాచిన తన నగల్ని అమ్మడానికీ వెనకాడలేదు కరీమా. రెహమాన్‌కు ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్లు. అక్క కొడుకే యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌. 1987లో చెన్నైలోని కోడంబాకం ఇంటికి వచ్చిన రెహమాన్‌ కుటుంబం, అప్పట్నుంచీ అదే ఇంట్లో ఉంటోంది. ప్రతి శుక్రవారం ఇంటి దగ్గర ఉచితంగా బిర్యానీ పంచుతారు.

ప్రకటనలకు పనిచేశాడు. సినిమాల్లోకి రాకముందే 300 ప్రకటనలకు పనిచేశాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్‌ జింగిల్స్‌ చేసేవాడు. వారి ద్వారానే రెహమాన్‌కు మణిరత్నంతో పరిచయమైంది.

* రోజాకి అందుకున్న మొత్తం రూ.25వేలు. ‘రోజా’ సమయంలో మణిరత్నంకి రెహమాన్‌ తన చిన్న గదిలోని స్టూడియోలో పాటలు వినిపించాడు. పాతికేళ్ల తర్వాత ఈ ఏడాది ‘చెలియా’ ట్యూన్‌లను విమానంలో ప్రయాణిస్తూ వినిపించాడు. ఈ పాతికేళ్లలో మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ సంగీతం అందించింది రెహమానే.

* పాటకి పల్లవి, చరణం ఉండాలన్న సంప్రదాయాన్ని రోజాలోని ‘నాగమణీ’ పాటతోనే చెరిపేశాడు.

ఆరంభం అదిరింది

తొలి చిత్రం ‘రోజా’తోపాటు మెరుపు కలలు, లగాన్‌, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నాడు. హిందీలో నేరుగా సంగీతం అందించిన మొదటి సినిమా ‘రంగీలా’.

* కేంద్ర ప్రభుత్వం 2010లో ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది.

* రెహమాన్‌కి ముందు వరకూ సినిమా పాట నిర్మాత సొంతం, రెహమాన్‌ వచ్చాక అవి సంగీత దర్శకుల సొంతమయ్యేలా మార్చాడు.

* చిన్న పిల్లలతో పాడించడం ఇష్టం. తన మేనల్లుడి చేత జెంటిల్‌మేన్‌లో ‘చికు బుకు చికు బుకు రైలే’… పాడించాడు. తాజాగా ‘అదిరింది’లోనూ ఓ పిల్లాడితో పాడించాడు.

* రెహమాన్‌కి వాళ్ల నాన్న ఇచ్చిన కీబోర్డ్‌ ఇప్పటికీ అతడి స్టూడియోలో ఉంది.

* కేఎమ్‌ మ్యూజిక్‌ కన్జర్వేటరీ పేరుతో చెన్నైలో ఒక సంగీత పాఠశాలను ప్రారంభించాడు. వీరి స్కూల్లో స్థానిక పాఠశాల విద్యార్థులకు సంగీతంలో ఉచిత శిక్షణ ఇస్తారు.

* కోల్డ్‌ప్లే, అడీల్‌, జయాన్‌ మాలిక్‌ల సంగీతం వింటాడు. ‘ది కార్పెంటర్స్‌’… రెహమాన్‌ కొన్న మొదటి సీడీ.

* 1997లో దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ‘వందేమాతరం’ ఆల్బమ్‌ చేశాడు.

* 2005లో టైమ్‌ మ్యాగజైన్‌ ‘10 బెస్ట్‌ సౌండ్‌ట్రాక్స్‌’ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌లో ‘రోజా’ ఒకటి. రెహమాన్‌ను 2009లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగానూ గుర్తించింది.

* రెహమాన్‌ గౌరవార్థం 2013లో కెనడాలోని ఒంటారియా రాష్ట్రంలో ఒక వీధికి అతని పేరు పెట్టారు. భార్యా పిల్లలు…

రెహమాన్‌ భార్య పేరు సైరాబాను. వీరికి ఇద్దరు అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

రజినీ అభిమాని

రాత్రిళ్లు పనిచేయడం రెహమాన్‌కు నచ్చుతుంది. రోజూ ఉదయం 5:30కి ప్రార్థన చేస్తాడు. అర్ధరాత్రి రెండూ మూడు వరకూ ఉండి ఉదయాన్నే మళ్లీ నిద్ర లేవడం కష్టమని అంతవరకూ మేల్కొని ఉండి ప్రార్థన చేసి నిద్రపోతాడు.

తమిళ నీతి పద్య గ్రంథం ‘తిరుక్కురళ్‌’ బాగా చదువుతాడు. బాణీలు రానపుడు ఆ పద్యాల్లో ఒకదానికి బాణీ కడుతూ తనకు కావాల్సింది సృష్టించుకుంటాడు.

* లాస్‌ ఏంజెలెస్‌లో ఒక ఇల్లు ఉంది. పని ఒత్తిడి నుంచి సేదదీరుతూ, సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ఆత్మపరిశీలన చేసుకోవడానికీ అక్కడికి వెళ్తానంటాడు.

* రజనీకాంత్‌ అభిమాని. ఆయన నమ్మే చాలా సిద్ధాంతాలనే తనూ నమ్ముతానంటాడు. అనుభవాలనుంచి పాఠాల్ని నేర్చుకోవడం ఆయన్నుంచే తెలుసుకున్నాడట.

* మైఖేల్‌ జాక్సన్‌ని రెండు సార్లు కలిసి మాట్లాడాడు. ఫోన్లో కూడా మాట్లాడుకునేవారట. జాక్సన్‌ని ఇబ్బంది పెట్టకూడదనీ ఫొటో అడగలేదని చెప్పే రెహమాన్‌ అది తీరని కోరిక అంటాడు. ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్టు చేయాలని అనుకున్నారట కూడా!

* సూఫీ సంగీతం నేర్చుకున్నాక తన ప్రపంచం మరింత విస్కృతమైందని చెప్పే రెహమాన్‌… తనపైన గజల్స్‌ గాయకుడు నుస్రత్‌ ఫతే అలీఖాన్‌ ప్రభావం ఉందంటాడు.

* సుభాష్‌ ఘాయ్‌ సూచనతో హిందీ పద్యాలూ, దోహాలను చదువుతూ ఆ భాషపైన పట్టు సాధించిన రెహమాన్‌ తర్వాత ఉర్దూ, పంజాబీ నేర్చుకోవడంపైనా దృష్టిపెట్టాడు.

* ఎయిర్‌టెల్‌ వాణిజ్య ప్రకటన కోసం రెహమాన్‌ స్వరపర్చిన ట్యూన్‌… ప్రపంచంలోనే అత్యధికంగా 15 కోట్ల డౌన్‌లోడ్లు నమోదు చేసింది.

* తన స్టేజి షోలూ, ఇతర లైవ్‌షోల వీడియోలు చూడ్డం మొదలుపెట్టాక తన శైలి మార్చుకున్నానంటాడు రెహమాన్‌. ‘అవి ఎంతో బోరింగ్‌గా అనిపించేవి. నేను స్టేజిమీద కదులుతూ ప్రేక్షకులతో ఇంకాస్త కలిసిపోతే బావుంటుందనిపించింది’ అని చెబుతాడు రెహమాన్‌. మహా సిగ్గరి అయిన రెహమాన్‌ ఓ షోలో స్టేజి దిగి ముందు వరుసలో ఉన్న అమ్మాయిని ‘హౌ మచ్‌ డు యూ లైక్‌ మ్యూజిక్‌? డూ యు లవ్‌ మి?’ అని ప్రశ్నలు వేశాడంటే ఎంత మారాడో అర్థం చేసుకోవచ్చు.

* కాన్సర్ట్‌ల కోసం స్టైలింగ్‌ కూడా మెరుగుపర్చుకున్నాడు. 2010 నుంచి భార్య సైరానే రెహమాన్‌కి స్టైలిస్ట్‌గా ఉంటోంది. కాన్సర్ట్‌కి సిద్ధమవుతూ, యువ మ్యుజీషియన్స్‌ నుంచి కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకుంటాడు. ముందు రోజు బాగా నిద్రపోతాడు కూడా, లేదంటే గొంతు సరిగ్గా రాదంటాడు. రెహమాన్‌ సినిమా పాటలూ, లైవ్‌షోలూ, స్టేజి షోలన్నీ కలిసి ‘ఓపెన్‌ హార్ట్‌’ పేరుతో సినిమాగానూ వచ్చింది.

* వర్చువల్‌ రియాలిటీ సినిమా ‘లే మస్క్‌’ తీస్తున్నాడు. భార్యతో కలిసి దీనికి కథ రాసిన రెహమాన్‌, మొదటిసారి దర్శకుడిగా మారాడు.

* ‘బోంబే డ్రీమ్స్‌’ మొదటి అంతర్జాతీయ ఆల్బమ్‌. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌, పీలే, 127 అవర్స్‌… లాంటి 13 హాలీవుడ్‌ సినిమాలకు సంగీతం అందించాడు. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌… రెండు ఆస్కార్లూ, రెండు గ్రామీల్నీ, బాఫ్టా, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్నీ తెచ్చింది. ఒకే ఏడాది రెండు ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి రెహమాన్‌

అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

Feedback on WhatsApp