28, డిసెంబర్ 2020, సోమవారం

లంబసింగి అందాలు

లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు

లంబసింగి

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి.

మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు.

సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే... ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు.

శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసిపోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో డిసెంబరు నుంచి జనవరి చివరి వరకూ అతి చల్లటి వాతావరణం కనిపిస్తుంది.

ఈ కాలంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం పదిగంటలైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం

లంబసింగి

'ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు'

ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్రబయలు అని పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.

ఈ చలి తీవ్రతకి ఓసారి ఓ దొంగ ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

"ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నా చిన్నతనంలో జరిగిన సంఘటన చెబుతాను. ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థులు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒక పెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆ కొయ్యకి కట్టి... రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసానులు వైద్యం చేసి కాపాడారు. అతడు కోలుకోడానికి మూడు రోజులు పట్టింది. ఇక్కడ ఆ స్థాయిలో చలి ఉంటుంది. ఒకప్పుడు మా గ్రామంలో పది మంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మా గ్రామానికి వస్తున్నారు. అసలు ఇది మా ఊరేనా అనిపిస్తుంటుంది" అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

లంబసింగి

నిత్యం భోగి పండగే

కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది లంబసింగి. అందరికి భోగి పండగ ఏడాదికి ఒకసారి వస్తే... ఇక్కడి వారికి మాత్రం నిత్యం భోగి పండగే. నిత్యం చలి మంటలు కనిపిస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ... అలాగే సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.

"ఇప్పుడు చలీ, మంచూ... అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ మేం పుట్టి పెరిగింది ఈ చలిలోనే, మా జీవితం గడిచేది ఈ మంచులోనే. అయితే ఏడాదిలో మూడు నెలల పాటు పర్యాటకులు రావడంతో మాకు పండగలా ఉంటుంది. టీవీ, పేపర్లలో మా గ్రామాన్ని చూపించడం మాకు భలే సరదాగా ఉంటుంది. మాకు టీ, టిఫిన్ వ్యాపారం బాగా జరుగుతుంది. కాకపోతే సీజన్ అయిపోగానే మళ్లీ మా గ్రామాలు బోసిపోతాయి. అప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది" అని స్థానిక టీ దుకాణం యాజమని సోమశేఖర్ చెప్పారు

లంబసింగి

'ఉండేది 250 మంది... వచ్చేది లక్షల మంది'

దట్టంగా కమ్ముకున్న పొగమంచు ఓవైపు... మంచు తుంపరుల పలకరింపు మరోవైపు... గాలిని సైతం గడ్డకట్టించే చల్లగాలి ఇంకోవైపు... ఇవి లంబసింగిలో నిత్యం కనిపించే దృశ్యాలు.

మైదాన ప్రాంతాలకు సుదూరంగా ఉండే లంబసింగి లాంటి గిరిజన గ్రామాలకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషులు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

లంబసింగిలో ఉన్నవి కేవలం 60 కుటుంబాలు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకులతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది.

"లంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ 10 నుంచి 12 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. నాలుగు నెలల పాటు సీజన్ కొనసాగుతుంది. లంబసింగి ఏజెన్సీ టూరిజానికి హాట్ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే లంబసింగికి ఆంధ్రా కశ్మీర్, ఆంధ్రా ఊటీ, దక్షిణాది కశ్మీర్ అనే పేర్లొచ్చాయి. టూరిజం శాఖ కూడా ఈ ప్రాంతాన్ని ప్రొమోట్ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయడంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది" అని లంబసింగి టూరిజం యూనిట్ మేనేజర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

లంబసింగి

కొండగ్రామంలో హనీమూన్

విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం. అందులో 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణమే. వంపులు తిరిగిన కొండల్లో సాగే ఈ ప్రయాణం నిజంగా ఒక మధురానుభూతే.

లంబసింగి వరకు మాములుగా ఉండే చలి... చెక్ పోస్ట్ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఛాయ్ మీద ఛాయ్ కొట్టాల్సిందే. లేదా చలిమంటల వద్దకు పరుగులు పెట్టాల్సిందే.

"మాది విజయవాడ. లంబసింగి గురించి 5 ఏళ్ల క్రితం తెలిసింది. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు నాకు పెళ్లైంది. హానీమూన్‌కి ఎక్కడికో వెళ్లడం ఎందుకు లంబసింగైతే బాగుంటుందని ఇక్కడికే వచ్చాం. లంబసింగి వాతావరణం అద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రకృతి అందాల్నీ... పై నుంచి పడుతున్న మంచు కిరణాల్నీ... ఎప్పటీకి మరచిపోలేను" అని నిఖిత బీబీసీతో చెప్పారు.

లంబసింగి

3 గంటల కోసం... 2 రోజుల పర్యటన

ఇక్కడి మంచు అందాలనూ... ఎప్పుడూ అనుభవించనంత చలినీ... ఎంజాయ్ చేయాలంటే రెండు రోజుల లంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసుకోవాలి. ముందురోజు రాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్న టూరిస్టులు... లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోదయాన్ని చూడటం కోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు...చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.

లంబసింగిలో తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన చలి ఉదయం ఏడు గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.

కుటుంబాలు, కొత్త జంటలు, ప్రేమికులు ఇలా ఎక్కడెక్కడి నుంచో 'ఛలో లంబసింగి' అంటూ వస్తుంటారు. శీతకాలం వారాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు, భువనేశ్వర్ నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

దీంతో ఈ గిరిజన గ్రామంలో గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయి...నగర వాతావరణాన్ని తలపిస్తుంది. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ కెమెరాలకు పనిచెబుతారు. ప్రకృతి అందాల నేపథ్యంతో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకులు చలిమంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు.

లంబసింగి

మంచు 'పాలసముద్రం'

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో 'చెరువులవేనం' అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో, ఫోటోల్లోనో గ్రాఫిక్ మాయజాలంలో చూసే పాలసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్షమతుంది.

మంచు మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే 'చెరువులవేనం' పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. ఉదయం నాలుగైదు గంటలకే లంబసింగి చేరుకున్న పర్యాటకులు 'చెరువులవేనం' వెళ్లేందుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాలను ఆస్వాదిస్తారు.

ఇక లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వాయర్ ఉంది. ఇది కూడా పర్యాటక కేంద్రమే. ఈ రిజర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.

ఈ రిజర్వాయర్‌పై 'జిప్ వే' ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్ ఒక చివర నుంచి మరో చివరకు గాల్లో తేలుతూ...సెల్ఫీలు తీసుకుంటూ 'జిప్ రోప్' ద్వారా చేరుకుంటారు పర్యాటకులు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులను అలరించేందుకు థింసా నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.

లంబసింగి

పెరిగిన పర్యాటకం... తగ్గిన వలసలు

లంబసింగితో పాటు చుట్టు పక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతుండేవారు. అయితే గత కొంతకాలంగా లంబసింగి విపరీతంగా ఫేమస్ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య అనుహ్యాంగా పెరిగింది.

పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాలు విస్తరించాయి. టూరిస్టులు పెరగడంతో స్థానిక యువకులు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు.

ఇక్కడ 'నైట్ స్టే' చేసేందుకు రిసార్ట్స్, హోటల్స్, గుడారాలను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికులు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది.

"టిఫిన్, టీ దుకాణాలతో పాటు రాత్రి స్టే చేసేందుకు టూరిస్టులకు గుడారాలు అద్దెకివ్వడం, టూరిస్టుల కోరిక మేరకు వారు భోజన సౌకర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధి పొందేకంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని...అన్ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు రిసార్ట్స్ కూడా రావడంతో... వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది" అని గుడారాలను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్ చెప్పారు

లంబసింగి

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే...

లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమతుల్యతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటరాలజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ.

"రెండు చిన్న కొండల మధ్యలో ఉండే గ్రామం లంబసింగి. రెండు కొండల మధ్య నుంచి వచ్చే శీతల గాలులు అక్కడ మేఘాలను నిలవనివ్వవు. దాంతో అక్కడ చల్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరో కారణం. ముఖ్యంగా గుంపులుగా ఉండే చెట్ల వల్ల ఇక్కడి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ప్రకృతి సమతుల్యత ఉన్న ప్రదేశాల్లో చల్లని, అతి చల్లని వాతావరణం ఉంటుంది. అలాగే సైబీరియన్ వేవ్స్ ప్రభావం కూడా అధికంగా ఉండటంతో అక్కడి నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుంది"అని ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు


బిబిసి నుండి సేకరణ...